కోల్‎కతా తొక్కిసలాటపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం.. హైకోర్టు జడ్జితో SIT విచారణ

కోల్‎కతా తొక్కిసలాటపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం.. హైకోర్టు జడ్జితో SIT విచారణ

కోల్‎కతా: ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బాగన్ దుర్గా పూజా మండపం దగ్గర తొక్కిసలాట జరిగి 19 మంది మరణించిన ఘటనపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కలకత్తా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆదివారం (అక్టోబర్ 18) మీడియాతో మాట్లాడుతూ.. చోర్‌బాగన్ దుర్గా పూజా మండపం దగ్గర జరిగిన తొక్కిసలాటపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోల్‎కతా హైకోర్టు సిట్టింగ్ జడ్జి సిట్‎కు నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఇందుకోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుందని తెలిపారు. హైకోర్టు నుంచి అనుమతి రాగానే ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని అధికారులు సేకరించారని.. జనసమూహ నియంత్రణలో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే పూజా కమిటీ నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, పోలీసు అధికారులైనా సరే ఎవరినీ విడిచిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. బెంగాల్‎లో గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని.. ప్రతిపక్షాలు ఈ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. దుర్గా దేవి మండపాల దగ్గర వీఐపీ ట్రీట్మెంట్ క్లోజ్ చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 

చోర్‌బాగన్ తొక్కిసలాట మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి 'గ్రూప్-డీ' ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే, గాయపడిన బాధితులకు రూ. 5 లక్షల సహాయంతో పాటు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.