మన దేశంలో కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏళ్లకు ఏళ్ళు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు చాలానే ఉంటాయి.చరిత్రలో దశాబ్దాల తర్వాత తెగిన కేసులు చాలా ఉన్నాయి. ఇంకొన్ని కేసుల్లో కొన్నేళ్లపాటు శిక్ష అనుభవించి నిర్దోషి అని తేలిన ఘటనలు కూడా చూశాం. బీహార్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 35 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత కేసు గెలిచి తన భూమి సొంతం చేసుకుంది 103 ఏళ్ళ బామ్మ. బీహార్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బీహార్ లోని చంపారన్ జిల్లాకు చెందిన హబీబన్ ఖతూన్ తన భూమిని సొంతం చేసుకునేందుకు 35 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేశారు. మూడు దశాబ్దాల న్యాయ పోరాటం తర్వాత ఖటూన్ భూమిని ఆమెకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. దీంతో తూర్పు చంపారన్ జిల్లాలోని ఒక గ్రామంలో 35 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం ఎట్టకేలకు ముగిసింది. కోర్టు ఆదేశాల మేరకు, జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వివాదాస్పద భూమిని ఖటూన్‌కు లాంఛనంగా అప్పగించింది.
దాదాపు 16 వందల చదరపు అడుగుల భూమికి సంబంధించిన వివాదం 1994 నుండి కొనసాగుతూ, సివిల్ కోర్టులో విచారణలో ఉంది. సుదీర్ఘ కాలం పాటు వాయిదాల అనంతరం, కోర్టు ఖటూన్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించి, ఉత్తర్వులు వెంటనే అమలయ్యేలా చూడాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో రెవెన్యూ శాఖ, స్థానిక అధికారులు, పోలీసులు సంయుక్తంగా గ్రామానికి చేరుకున్నారు. చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసి, భూమిని ఖటూన్‌కు అప్పగించారు. ఈ ప్రక్రియలో భాగంగా, గ్రామంలో డప్పులు కొడుతూ కోర్టు ఉత్తర్వును ఊరేగించారు.
ఈ క్రమంలో సంఘటనా స్థలంలో సుమారు 300 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఈ ఆపరేషన్ అంతటా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు, రెవెన్యూ అధికారులు, కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు అక్కడే ఉన్నారు. పరిపాలనా పర్యవేక్షణలో ఈ ప్రక్రియ మొత్తం శాంతియుతంగా జరిగింది.
ALSO READ : స్విగ్గీపై ఎంపీ మహువా మొయిత్రా ఫైర్..
భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత, హబీబాన్ ఖతూన్ కుటుంబం న్యాయవ్యవస్థకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. సంవత్సరాల తరబడి సాగిన న్యాయ పోరాటం తర్వాత తాము చివరకు తమ న్యాయమైన హక్కును దక్కించుకున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. న్యాయ ప్రక్రియపై చూపిన సహనం, విశ్వాసం ఫలితంగానే ఈ ఫలితం లభించిందని వారు అభివర్ణించారు.
