తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీతో ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్విగ్గీలో ఆర్డర్ చేసిన భోజనం మూడోసారి కూడా క్యాన్సిల్ కావడంతో పాటు, తన నుంచి మొత్తం రూ.1,457 క్యాన్సిలేషన్ ఫీజుగా వసూలు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం అందలేదని, సమస్య పరిష్కరించేందుకు సరైన కస్టమర్ సపోర్ట్ కూడా లభించలేదని ఆమె సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
స్విగ్గీ గౌర్మెట్ ద్వారా ఆర్సలాన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసినట్లు లేడీ ఎంపీ వెల్లడించారు. అయితే ఆ ఆర్డర్‌ను స్విగ్గీ రద్దు చేసినట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిందని, ఆర్డర్ నంబర్ 243092360048928ను జూలై 15న రాత్రి 7:55 గంటలకు రద్దు చేసినట్లు, రెస్టారెంట్ సర్వీస్ పేరుతో రూ.1,457 క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని మెయిల్‌లో పేర్కొన్నట్లు మహువా మొయిత్రా వెల్లడించారు.
Hello @Swiggy this is 3rd time you arbitrarily cancelled my order and have charged me full bill amount ₹1457 as “cancellation fee”. No dinner & no service help from anyone. pic.twitter.com/tQBl6X2XQr
— Mahua Moitra (@MahuaMoitra) July 16, 2026
ఈ విషయాన్ని మహువా ఎక్స్‌లో ప్రస్తావించడంతో పలువురు వినియోగదారులు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు ఆర్డర్లు టెక్నికల్ సమస్యల కారణంగా రద్దయ్యాయని, అయినా రీఫండ్ ఆలస్యం అవుతోందని ఫిర్యాదు చేశారు. ఒక వినియోగదారు తన రూ.2వేల765 ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ కూడా సాంకేతిక సమస్య కారణంగా రద్దయిందని షేర్ చేసుకున్నారు.
►ALSO READ | జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య సందేశం? ట్రంప్ బృందంపై ‘యుద్ధ లాభాల’ ఆరోపణలు!
అయితే మహువా మొయిత్రా ఫిర్యాదుపై స్విగ్గీ స్పందించింది. ఆమె అసంతృప్తిని అర్థం చేసుకున్నామని.. ఆర్డర్ రద్దు, వసూలైన ఛార్జీలపై పరిశీలించి పరిష్కారం చూపుతామని కంపెనీ ఎక్స్‌లో రిప్లై ఇచ్చింది. అయితే వినియోగదారుడి తప్పు లేకుండా ప్లాట్‌ఫామ్ వైపు నుంచి ఆర్డర్లు రద్దయినప్పుడు పూర్తి మొత్తాన్ని క్యాన్సిలేషన్ ఫీజుగా వసూలు చేయడం సరైనదేనా అనే చర్చ స్విగ్గీ చేసిన పనిపై నెట్టింట కొనసాగుతోంది. ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య కష్టమర్లకు కనీసం జవాబు చెప్పేది ఎవరంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
