'మహాప్రభు జగన్నాథ్' మూవీ రిలీజ్‌కు బ్రేక్.. హైకోర్టు స్టేకు అసలు కారణం ఇదేనా?

'మహాప్రభు జగన్నాథ్' మూవీ రిలీజ్‌కు బ్రేక్.. హైకోర్టు స్టేకు అసలు కారణం ఇదేనా?

జగన్నాథ స్వామి భక్తి, సంస్కృతి నేపథ్యంగా రూపొందిన యానిమేటెడ్ చిత్రం 'మహాప్రభు జగన్నాథ్' . అయితే ఈ మూవీ విడుదలకు ముందే చిత్ర యూనిట్ కు , భక్తులకు పెద్ద షాక్ తగిలింది. జూలై 17న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాపై ఒడిశా హైకోర్టు చివరి నిమిషంలో స్టే విధించింది. దీంతో విడుదల నిలిచిపోగా, చిత్ర బృందం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

'జై జగన్నాథ్' కు కొనసాగింపుగానే..

ఈ సందర్భంగా నిర్మాత దుర్గా ప్రసాద్ దలై అధికారిక ప్రకటన విడుదల చేశారు. మా యానిమేటెడ్ సిరీస్ 'జై జగన్నాథ్' కు కొనసాగింపుగానే ఈ చిత్రాన్ని రూపొందించాం. జగన్నాథ స్వామిపై అపారమైన భక్తి, నిజాయితీ, పవిత్రమైన ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కించాం. ఇది కేవలం ఒక భక్తుడి భక్తి భావాన్ని ప్రతిబింబించే కథ మాత్రమే అని తెలిపారు.

జగన్నాథుడి చరిత్ర  తెలుసుకునేలా..

అలాగే జగన్నాథ స్వామిని ఆరాధించే ప్రతి భక్తుడి మనోభావాలను మేము గౌరవిస్తాం. ప్రేక్షకులు ముందుగా సినిమా చూసి తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుకుంటున్నాం. ముఖ్యంగా రథయాత్ర సందర్భంగా చిన్నారులు, కుటుంబాలు జగన్నాథుడి చరిత్ర, సంస్కృతి, విలువలను తెలుసుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించాం అని పేర్కొన్నారు.

కారణం ఇదేనా?

ఇప్పటికే ఈ సినిమాకు హిందీ, ఒడియా, తెలుగు భాషల్లో సీబీఎఫ్‌సీ నుంచి U సర్టిఫికెట్ కూడా లభించింది. అయినప్పటికీ, ప్రత్యేక ప్రదర్శన అనంతరం గజపతి మహారాజా, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన సూచించిన మార్పులు చేయకుండా ప్రస్తుతం రథయాత్ర సమయంలో సినిమాను విడుదల చేయడం సముచితం కాదని ఒడిశా హైకోర్టు అభిప్రాయపడింది. మతపరమైన భావోద్వేగాలకు భంగం కలిగే అవకాశం ఉన్నందున విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో చిత్ర బృందం సుప్రీం కోర్టుకు ఆశ్రయించింది.

 ఎలె యానిమేషన్స్ సంస్థ బ్యానర్‌పై రూపొందిన ఈ 'మహాప్రభు జగన్నాథ్' చిత్రం, దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన 'జై జగన్నాథ్' కార్టూన్ సిరీస్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్ పోగో ఛానల్ ద్వారా ప్రసారమై చిన్నారులతో పాటు కుటుంబ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఈ సినిమా భవితవ్యాన్ని నిర్ణయించనుంది...