రైల్వే ప్రయాణికులకు ఒక సూపర్ గుడ్ న్యూస్. ఎప్పుడూ హ్యాంగ్ అవుతూ, టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బంది పెట్టే ఐఆర్సిటిసి (IRCTC) వెబ్‌సైట్‌ను రైల్వే శాఖ సరికొత్తగా మార్చింది. ప్రస్తుతం ఈ కొత్త వెబ్సైట్ 'బీటా వెర్షన్' (ట్రయల్ రన్) రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త వెబ్‌సైట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా....
కొత్త వెబ్సైట్ గురించి
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గత నెలలో జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT)ని వెళ్లినప్పుడు విద్యార్థులతో మాట్లాడుతూ.. జూలై 15 నాటికి కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే ఈ కొత్త వెబ్‌సైట్‌ను ప్రయోగాత్మకంగా విడుదల చేశారు.
భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ వెబ్సైట్ ద్వారా ప్రతిరోజూ దాదాపు 14.5 లక్షల రైలు టికెట్లు బుక్ అవుతుంటాయి. అందుకే ప్రయాణికులకు బుకింగ్ ప్రక్రియను మరింత స్మూత్, ఈజీ చేయడానికి ఈ మార్పులు చేశారు.
కొత్త వెబ్సైట్ లింక్
కొత్త లుక్‌తో వచ్చిన ఈ IRCTC బీటా వెబ్‌సైట్‌ను మీరు https://www.irctc.co.in/eticket/ అనే లింక్ ద్వారా ఓపెన్ చేయవచ్చు లేదా ప్రస్తుతం వాడుతున్న పాత వెబ్సైట్ హోమ్‌పేజీలో పైన కనిపించే బీటా వెర్షన్ లింక్‌ను క్లిక్ చేసి కూడా దీనిని చూడవచ్చు.
ఈ వెబ్సైట్ వాడిన తర్వాత మీకు ఎలా అనిపించిందో, ఎలాంటి మార్పులు కావాలో మీ అభిప్రాయాన్ని (Feed back) కూడా రైల్వే శాఖకు తెలియజేయవచ్చు.
ఈ కొత్త వెబ్సైట్లో వచ్చిన 4 ముఖమైన మార్పులు
కొత్త వెబ్సైట్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైల్వే శాఖ నాలుగు ముఖ్యమైన మార్పులు చేసింది:
*క్యాప్చా ఇబ్బందులు ఉండవు: టికెట్ బుక్ చేసేటప్పుడు విసుగు తెప్పించే అనవసరమైన క్యాప్చాలు (Captcha) కానీ, స్క్రీన్‌పై అడ్డంగా వచ్చే పాప్-అప్ ప్రకటనలు కానీ ఇందులో ఉండవు.
*సీట్ల వివరాలు ఈజీగా చూడొచ్చు: రైలులోని అన్ని క్లాసుల (స్లీపర్, ఏసీ వంటివి) సీట్ల లభ్యతను ఒకేసారి స్క్రీన్‌పై చూసుకోవచ్చు.
*వేగంగా చెక్అవుట్: టికెట్ బుక్ చేయడానికి గతంలో ఉన్నట్టు ఎక్కువ స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ క్లిక్‌లతోనే బుకింగ్ పూర్తవుతుంది.
ఈజీ బుకింగ్: మీరు తరచు ప్రయాణించే ప్రయాణికుల వివరాలు ఇందులో సేవ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతిసారీ పేర్లు, వివరాలు టైప్ చేయాల్సిన పని లేకుండా వేగంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ALSO READ : 2027 నుంచి కొత్త మైలేజ్ నిబంధనలు, ఈవీలు–హైబ్రిడ్ కార్లకు భారీ ప్రోత్సాహం!
త్వరలోనే పూర్తి కొత్త వెబ్సైట్
ప్రస్తుతం వెబ్సైట్ వెనుక పని చేసే 'ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)' ని కూడా రైల్వే శాఖ అప్‌గ్రేడ్ చేస్తోంది. దశాబ్దాల నాటి ఈ పాత సిస్టమ్‌ను మార్చే పని కూడా సాగుతోంది. ఈ అప్‌గ్రేడ్ పనులు పూర్తయిన వెంటనే, రాబోయే కొన్ని వారాల్లోనే లేటెస్ట్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌తో పూర్తిస్థాయి కొత్త ఐఆర్సిటిసి పోర్టల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
