మధ్యప్రదేశ్‌లో ఊహించని దొంగతనం జరిగింది. శివపురి జిల్లాలోని చారిత్రాత్మక 'నర్వార్ కోట' నుండి సింధియా రాజుల కాలం నాటి, ఏకంగా 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక భారీ ఫిరంగిని దొంగలు ఎత్తుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 15, 16 మధ్య రాత్రి సుమారు 25 నుండి 30 మంది దొంగల ముఠా నర్వార్ కోటలోకి వెనుక దారి నుండి ప్రవేశించింది. వారు ఊరికే రాలేదు.. వారితో పాటు ఒక భారీ క్రేన్, ట్రక్కును కూడా తీసుకువచ్చారు. కోట లోపల మొత్తం 14 చారిత్రక ఫిరంగులు ఉండేవి. అందులో 3,000 కిలోల (3 టన్నులు) బరువున్న అష్టధాతువులతో చేసిన ఒక ఫిరంగిని క్రేన్ సాయంతో ట్రక్కులో వేసుకుని చెక్కేశారు.
మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు
ఆ సమయంలో కోట వద్ద డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ... "వచ్చిన దొంగల చేతుల్లో తుపాకులు, ఇతర ఆయుధాలు ఉన్నాయి. మమ్మల్ని అడ్డుకుంటే చంపేస్తామని బెదిరించారు. కోటలో కనీసం వెలుతురు లేదు, మా చేతుల్లో కేవలం కర్రలు మాత్రమే ఉన్నాయి. దాంతో మేము ఏమీ చేయలేకపోయాము. ఇప్పుడు కోటలో 13 ఫిరంగులు మాత్రమే మిగిలాయి." అని చెప్పాడు.
ముందే పక్కా ప్లాన్
ఈ దొంగతనం చాలా పక్కా ప్లాన్‌తో జరిగింది. ఫిరంగి ఎక్కడుంది ? దానిని ఎత్తడానికి ఎంతమంది కావాలి? ఏ వాహనం సరిపోతుంది ? అనే విషయాలపై దొంగలకు ముందే పూర్తి అవగాహన ఉంది. అయితే, గత 12 రోజులుగా కోట పరిసరాల్లో అనుమానాస్పద కదలికలు ఉన్నాయని స్థానికులు చెప్పినప్పటికీ, పురావస్తు శాఖ కానీ, పోలీసులు కానీ భద్రతను పెంచకపోవడం గమనార్హం.
అసలు ఈ ఫిరంగి ప్రత్యేకత ఏంటి?
ఈ ఫిరంగి 16వ శతాబ్దం (సింధియా రాజుల కాలం) నాటిది. దీనిని ప్రత్యేకమైన అష్టధాతువులతో తయారుచేశారు. అప్పటి లోహ సాంకేతికతకు ఇది నిదర్శనం. దీనిపై ఉన్న అరుదైన చెక్కడాలు ఎంతో ప్రత్యేకమైనవి.
దీని చారిత్రక విలువను లెక్కకట్టలేనప్పటికీ.. అంతర్జాతీయ Black Marketలో దీని ధర కోట్లలో పలుకుతుందని అంచనా. ఈ ఘటన వెనుక అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, సమీప ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చారిత్రక వస్తువులను అక్రమంగా రవాణా చేసే నెట్‌వర్క్‌లను పట్టుకోవడానికి సైబర్ సెల్ సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
