న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రస్తుత డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వబోమని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే తమ వైఖరిని పునరుద్ఘాటించింది. ప్రస్తుత డీలిమిటేషన్ బిల్లులో కేంద్రం ఏమైనా మార్పులు చేస్తే మద్దతు విషయంలో ఆలోచిస్తామని స్పష్టం చేసింది. జూలై 20 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఈ సెషన్ లో డీలిమిటేషన్ తో పాటు పలు ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీలతో ఆ పార్టీ చీఫ్, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహాలు, విధివిధానాలపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డీఎంకే పార్లమెంటరీ పార్టీ పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది.
డీఎంకే తీర్మానాలు:
- జనాభా ఆధారంగా, మహిళా రిజర్వేషన్‌తో ముడిపడి ఉన్న ప్రస్తుత డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దు
- కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత డీలిమిటేషన్ బిల్లు స్థానంలో కొత్త బిల్లు తీసుకొస్తే.. అందులోని సిఫార్సుల ఆధారంగా మద్దతుపై నిర్ణయం
- కావేరీ నదిపై ప్రతిపాదిత మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకం.
- ఈ వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి
- తమిళనాడు ప్రజల హక్కులు, రాష్ట్ర స్వయంప్రతిపత్తికి సంబంధించిన అంశాలపై ఉభయ సభల్లో గొంతెత్తాలి
- అధికార దాహంతో డీఎంకేకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలి
