Maa Inti Bangaram OTT: ఓటీటీలోకి సమంత 'మా ఇంటి బంగారం'.. కానీ ఆ మిస్టరీ మెసేజ్ మాత్రం మిస్సింగ్!

Maa Inti Bangaram OTT: ఓటీటీలోకి సమంత 'మా ఇంటి బంగారం'..  కానీ ఆ మిస్టరీ మెసేజ్ మాత్రం మిస్సింగ్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టాలీవుడ్ లో మహిళా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రాల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరి అరుదైన చిత్రంగా ప్రత్యేక గుర్తింపును సామ్ సొంతం చేసుకుంది. థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 

ఓటీటీలో 'మా ఇంటి బంగారం' రిలీజ్..

జియో హాట్ స్టార్ లో ఈ రోజు ( జూలై 17.2026 )  నుంచి తెలుగు, తమిళం, కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. హిందీ వెర్సన్ లో స్ట్రీమింగ్ పై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న  ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా అదే స్థాయిలో ఆదరణను దక్కించుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రాజ్ నిడిమోరును వివాహం తర్వాత నటించిన తొలి చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో  సమంత  ఫుల్ ఖుషిలో ఉంది. 

మిస్టరీ మెసేజ్ మిస్సింగ్..

అయితే ఓటీటీ వెర్షన్‌లో ఒక ఆసక్తికరమైన విషయం కనిపించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో సినిమా ముగిసిన తర్వాత ఎండ్ క్రెడిట్స్‌లో "FUSN, IYKYK" అనే క్రిప్టిక్ మెసేజ్ కనిపించింది. ఆ నాలుగు అక్షరాల వెనుక అర్థం ఏమిటి? ఎవరికి సంబంధించిన సంకేతం? అనే చర్చలు అప్పట్లో విపరీతంగా జరిగాయి. కొందరు అది చిత్ర బృందానికి చెందిన వ్యక్తిని సూచిస్తుందని, మరికొందరు భవిష్యత్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన హింట్ అని అభిప్రాయపడ్డారు. అయితే ఆ సందేశం గురించి చిత్రబృందం ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.

ALSO READ : Jana Nayagan: ‘అంబేడ్కర్ చట్టం’ డైలాగ్ సెన్సార్ తొలగింపు..

ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో ఆ మెసేజ్ పూర్తిగా తొలగించబడటం మరోసారి నెటిజన్లలో సందేహాలను రేకెత్తిస్తోంది. థియేటర్లలో ఉన్న ఆ టెక్స్ట్‌ను ఎందుకు తీసేశారు? ఉద్దేశపూర్వకంగానే తొలగించారా? లేక సాంకేతిక కారణాల వల్ల జరిగిందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మిస్టరీకి ఎప్పుడైనా సమాధానం దొరుకుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, మంజూష, ఆనంద్, లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'మా ఇంటి బంగారం' ఇప్పుడు ఓటీటీలో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుందా? అలాగే 'FUSN, IYKYK'మిస్టరీ వెనుక అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.