తెలంగాణలో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. రాష్ట్రంలో ఈఎస్ఐ ఆస్పత్రుల ఆధునీకరణతో పాటు యువతకు విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఒక స్పష్టమైన విజన్‌తో తాము ముందుకు వెళ్తున్నామని, రాష్ట్రంలోని ఈఎస్ఐ (ESI) ఆస్పత్రుల సేవలను మరింత మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు. ఇందులో భాగంగా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిని వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే శంషాబాద్, రామగుండం ప్రాంతాలలో వంద పడకల సరికొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికులకు, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వైద్యంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు 120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను స్థాపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా గ్లోబల్ ఉద్యోగాల కోసం టామ్‌కామ్ (TOMCOM) ద్వారా విదేశీ భాషలను నేర్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఒక్క జర్మనీలోనే 28 వేల విదేశీ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని.. యువత విదేశీ భాషలపై పట్టు సాధించి, సరైన నైపుణ్యాలు (Skills) నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో భారీ పే-స్కేల్‌తో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి వివేక్ పిలుపునిచ్చారు.
