ఆధ్యాత్మికం : శ్రీకృష్ణుడి చివరి సందేశం.. సాయం అడిగితేనే చేయాలి..!

ఆధ్యాత్మికం : శ్రీకృష్ణుడి చివరి సందేశం..   సాయం అడిగితేనే చేయాలి..!

శ్రీ కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్పిన సందేశం గీత రూపంలో అందరికీ తెలిసిందే. అయితే కృష్ణుడు చివరిసారిగా బోధించిన సందేశం మరొకటి ఉంది. అదే ఉద్ధవ గీత. ఉద్దవుడు శ్రీ కృష్ణుడికి చిన్ననాటి స్నేహితుడు. కృష్ణుడికి రథసారధి కూడా. అయితే ద్వాపర యుగంలో కృష్ణుడు తన అవతారం చాలించే ముందు ఉద్దవుడిని పిలిచి... "ఉద్ధవా, నా నుంచి ఎంతోమంది ఎన్నో వరాలు పొందారు. కానీ, నువ్వు నన్ను ఎప్పుడూ ఏదీ కోరలేదు. నీ స్నేహానికి బహుమతిగా ఏదైనా ఇవ్వాలని ఉంది. ఏమి కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఉద్దవుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానమే ఈ ఉద్దవ గీత.


కృష్ణుడి మాటలకు ఉద్దవుడు.. కృష్ణా... నీ లీలలను అర్ధం చేసుకోవటం. ఎవ్వరి వల్లా కాదు. నాకు నీ నుంచి ఏ వరమూ వద్దు. కానీ నేను నిన్ను కొన్ని సందేహాలు అడుగుదామనుకుంటున్నాను. అడగమంటావా అని అంటాడు. కృష్ణుడు నువ్వు ఏది అడిగినా చెప్తాను. అడుగు ఉద్ధవా.. అంటాడు. అప్పుడు ఉద్దవుడు.. 

కృష్ణా, నువ్వు మహాభారత యుద్ధంలో పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయాలు నాకేమాత్రమూ అర్ధం కాలేదు. పాండవులు నీప్రాణ స్నేహితులు, అలాగే వాళ్లు. నిన్ను ఎంతగానో నమ్మారు. నువ్వువారి వర్తమానం, భవిష్యత్తు తెలిసినవాడివి. 

అలాంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? అసలు అలాంటి వ్యసనాలను ఎందుకు ప్రోత్సహించావు? ఒకవేళ జూదం ఆడనిచ్చినా.. కనీసం వారిని గెలిపించి, కౌరవులకి బుద్ధి చెప్పి ఉండాల్సింది కదా? అది కూడా చెయ్యలేదు. యుధిష్టరుడు అంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు. తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా సువ్వు వాళ్లని కాపాడి ఉండొచ్చుకదా? 

కౌరవులు దుర్బుద్ధితో జూదంలో మోసం చేసి, ద్రౌపదిని గెలిచారు. కనీసం అప్పుడైనా సువ్వు నీ మహిమతో పాండవులని గెలిపించి ఉండాల్సింది. ఆమె గౌరవానికి భంగం కలిగేవరకూ నువ్వు స్పందించలేదు. సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని గొప్ప పేరుపొందావు. కానీ ముందే నువ్వు కలుగజేసుకుని ఉంటే ఆమెకి నిండు సభలో అవమానం తప్పేది కదా? ఇలా చేయడం వెనుక కారణమేంటి కృష్ణా..అని ఉద్దవుడు కృష్ణుడి అడుగుతాడు.

ఉద్దవుడి ప్రశ్నలకు కృష్ణుడు ప్రేమగా... ఉద్ధవా... ప్రకృతి ధర్మం ప్రకారం అన్ని విధాలా జాగ్రత్త పడుతూ, అప్రమత్తంగా ఉంటూ, తగిన చర్యలను తీసుకునే వాడే గెలుపునకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యం లేకపోయినా ఆస్తిపరుడు. కనుక తన ఆస్తిని ఫణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెంను వేయించాడు. కానీ యుధిష్టరుడు మాత్రం.. పందాలను నా చేత వేయించాలి. అని అనుకోలేదు. నా సాయమును కోరనే లేదు. శకునితో నేను ఆడి ఉంటే
జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెంను శకుని వేయగలిగేవాడా? లేదా అతను చెప్పిన పందెం నాకు పడేది కాదా?

ఈ ఒక్కవిషయమే కాదు, ధర్మరాజు అజ్ఞానంతో మరొక తప్పు కూడా చేశాడు. నేను చేసుకున్న కర్మల వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు.. ఇటువైపు రాకూడదు. అని ప్రార్ధించాడు. దాంతో ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. యుధిష్టరుడు మాత్రమే కాదు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ నా సాయం కోరలేదు.

 చివరికి ద్రౌపది కూడా దుశ్సాసనుడు సభలోకి ఈడ్చుకెళ్లినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది. తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యే వరకూ నన్ను స్మరించలేదు. 

సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడుకోగానే.. నేను వెంటనే ప్రత్యక్షమయ్యి ద్రౌపదిని రక్షించలేదా? అని కృష్ణుడు ఉద్దవుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఉద్దవుడు, కృష్ణుడితో.. “అలాగైతే మాలాంటి సామాన్యులు సంగతేంటి?

మేము చేసే కర్మలలో కూడా నీ శరణు కోరితే కల్పించుకుని వెంటనే సాయం చేస్తావా? మమల్ని చెడు కర్మలు చేయకుండా కాపాడతావా? అని అడుగుతాడు. దానికి కృష్ణుడు చిన్నగా నవ్వి.. ఉద్ధవా నేను ఎవ్వరి కర్మలను నిర్వర్తించను. మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారానే సాగుతుంది. వాటిలో నేను కలుగజేసుకోను. కేవలం సాక్షిలాగా గమనిస్తుంటాను. అదే
భగవంతుని ధర్మం అని అంటాడు. 

ఆచరించాల్సిన ఆదేశం

నిజానికి ఉద్దవుడు అడిగిన సందేహాలు కేవలం ఉద్దవుడికి వచ్చినవే కాదు, మహాభారతం గురించి తెలిసిన వాళ్లందరికీ వస్తాయి. అందుకే ఉద్ధవ గీతను శ్రీకృష్ణుడు ఉద్దవునికి చేసిన ఉపదేశం అనేదానికంటే... అందరూ ఆచరించవలసిన ఆదేశం అనొచ్చు. 

 ఉద్దవ గీత శ్రీ భాగవతంలోని పదకొండవ స్కంధంలోని, ఆరవ అధ్యాయం నుంచి మొదలయ్యి..ఇరువై తొమ్మిదవ అధ్యాయంతో ముగుస్తుంది. శ్రీ కృష్ణుడు చివరిసారిగా చేసిన బోధ ఇదే. అందుకే దీన్ని 'శ్రీ కృష్ణ పరమాత్మ మనకిచ్చే వీడ్కోలు సందేశం" అని కూడా అంటుంటారు.