హైదరాబాద్ లో కదిలిన జగన్నాథ రథచక్రాలు.. ముగ్గులతో రోడ్లకు అందం.. కీర్తనలతో మార్మోగిన నగరం

హైదరాబాద్ లో కదిలిన జగన్నాథ  రథచక్రాలు.. ముగ్గులతో రోడ్లకు అందం.. కీర్తనలతో మార్మోగిన నగరం
  • జగన్నాథ్​ ఆలయాల నుంచి భారీ  ఊరేగింపులు  

సిటీ నెట్​వర్క్​, వెలుగు :  నగరంలో పలుచోట్ల జగన్నాతుడి రథయాత్ర గురువారం వైభవంగా సాగింది. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై ఆసీనులు కాగా భక్తులు తన్మయత్వంతో ఊరేగించారు. యాత్ర సాగిన రోడ్లను రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. కోలాటాలు, నృత్యాలతో, కీర్తనలతో నగర వీధులను హోరెత్తించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హారతులిచ్చారు. యువత భక్తులకు నీరు, మజ్జిగ, పానీయాలు పంపిణీ చేశారు. పలు చోట్ల భక్తులు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. 

ఎక్కడ చూసినా రథయాత్రలే.. 

 ఆబిడ్స్ ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్రను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మంత్రి శ్రీధర్​బాబు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. అశోక్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, బషీర్‌‌బాగ్, అబిడ్స్ మీదుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కొనసాగింది. అలాగే, సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్​నుంచి మొదలైన యాత్ర ఎస్పీ రోడ్, ప్యాట్నీ, మోండా మార్కెట్, క్లాక్ టవర్, సంగీత్ చౌరస్తా మీదుగా ఆలయానికి , జనరల్ బజార్‌‌ జగన్నాథ స్వామి ఆలయం నుంచి మొదలైన మరో ఊరేగింపు రాణిగంజ్, హిల్ స్ట్రీట్, ఆర్పీ రోడ్డు మీదుగా సాగుతూ తిరిగి దేవాలయానికి చేరుకుంది.

బంజారాహిల్స్​రోడ్​నంబర్​12 లోని పూరి జగన్నాథ్​టెంపుల్​నుంచి ప్రారంభమైన ఊరేగింపు కమాండ్​కంట్రోల్​సెంటర్​మీదుగా సాగింది. కూకట్​పల్లి ఇస్కాన్​ టెంపుల్​ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్రను హైదర్​నగర్​లోని మైసమ్మ, పోచమ్మ ఆలయం వద్ద  వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. జేఎన్​టీయూ, కేపీహెచ్​బీకాలనీ, కూకట్​పల్లి మీదుగా వై జంక్షన్​ వరకు రథయాత్ర కొనసాగింది.

 పాతబస్తీ షాఖర్ గంజ్ లోని 400 ఏండ్ల చరిత్ర ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమై సయ్యద్ అలీ చెబుత్ర, లాల్ దర్వాజా మోడ్, కురుమ గూడ కమాన్ మీదుగా పురాతన శ్రీ గోపాల కృష్ణ దేవాలయం వరకు కొనసాగింది.