చేనేతకు టెక్నాలజీ జోడించండి :  టెస్కో చైర్మన్ వెంకటరమణ..

చేనేతకు టెక్నాలజీ జోడించండి :  టెస్కో చైర్మన్ వెంకటరమణ..
  • పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచన 

హైదరాబాద్, వెలుగు: చేనేత, వస్త్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో యువత పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టెస్కో) చైర్మన్ దూడం వెంకటరమణ పిలుపునిచ్చారు. ఇందుకోసం యువ ఇంజనీర్లు, టెక్స్‌టైల్ నిపుణులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు, పరిశోధనలు, సృజనాత్మకతకు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు.

హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (కేఎల్‌బీఐఐహెచ్‌టీ)లో 2026–-27 నూతన విద్యా సంవత్సరం పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి దూడం వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణకు చేనేత రంగం గొప్ప సాంస్కృతిక వారసత్వమని, వేలాది కుటుంబాలకు జీవనాధారమని తెలిపారు. ఈ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూనే, ఆధునిక సాంకేతికతను జోడించి ప్రపంచ మార్కెట్లలో మన ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా, పదిమందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 2025-–26 అకడమిక్ ఇయర్‌‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులను దూడం వెంకటరమణ ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. అన్ని సబ్జెక్టుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్‌పర్సన్ జక్కిని అనిత, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సంయుక్త సంచాలకుడు ఎన్. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.