- చివరి ఆయకట్టుకు నీళ్లివ్వడమే లక్ష్యంగా పనులు: డిప్యూటీ సీఎం భట్టి
- టైమ్ పెట్టుకొని వైరా, పాలేరు రిజర్వాయర్లను లింక్ చేస్తానని వెల్లడి
- ఉత్తమ్, పొంగులేటితో కలిసి సీతారామ ప్రాజెక్టుపై క్షేత్ర స్థాయి సమీక్ష
- ఈ నెలలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు: మంత్రి ఉత్తమ్
భద్రాద్రి కొత్తగూడెం/మణుగూరు/సత్తుపల్లి, వెలుగు: గోదావరి జలాల వినియోగానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని, నెలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ పనుల
పురోగతిని పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి గోదావరి నీటిని సాధ్యమైనంత త్వరగా గ్రావిటీ, లిఫ్ట్‌ల ద్వారా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. లింక్ కెనాల్స్, టన్నెల్స్ ద్వారా వైరా, పాలేరు రిజర్వాయర్లకు లింక్ చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలోని యాతాలకుంట టన్నెల్ పనులను డిప్యూటీ సీఎం మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.1,000 కోట్ల బిల్లులు ఇచ్చామని, భూసేకరణ కోసం వెంటనే రూ.135 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు.
ఎప్పటికప్పుడు బిల్లులు సిద్ధం చేసి పంపాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గోదావరిపై వైఎస్సార్ హయాంలో రూ. 3,500 కోట్లతో చేపట్టిన గోదావరిపై రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల వ్యయాన్ని బీఆర్ఎస్ హయాంలో రీడిజైన్ రూ.24వేల కోట్లకు పెంచిందన్నారు.
తుమ్మిడిహెట్టిపై ప్రతి నెలా సీఎం రివ్యూ: ఉత్తమ్
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ నెలలోనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చర్చలు జరుపుతామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాణహిత,-చేవెళ్ల సుజల స్రవంతి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టులపై ప్రతి నెలా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ దాదాపు రూ. 1.81లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై దాదాపు రూ. 27,500కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బారేజీలనూ జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించారని, ఆర్మీతో పాటు ముంబాయి ఐఐటీ నిపుణులు ఈ బారేజీల వద్ద సాయిల్ టెస్ట్, నాణ్యత, నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను స్టడీ చేస్తున్నారని వివరించారు. అన్నారం, సుందిళ్ల బారేజీల్లో కూడా లీకేజీలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బ్యారేజ్‌లు సరిగా కట్టకుండా తమను బద్నాం చేస్తున్నారన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తొందని ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గానికి ఏ విధంగానైనా నీళ్లు ఇస్తానని ఉత్తమ్హామీ ఇచ్చారు.
1.20 లక్షల ఎకరాలకు సాగునీరు: పొంగులేటి
కరువు కాలంలోనూ సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్కూల్ లింక్ కెనాల్ ద్వారా1.20లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు విషాన్ని చిమ్ముతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావ్, రాందాస్ నాయక్, కలెక్టర్ అంకిత్, అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
