భారీగా రేషన్ బియ్యం, గోధుమలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి కర్నాటకకు తరలిస్తున్న ముఠా అరెస్ట్

 భారీగా రేషన్ బియ్యం, గోధుమలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి కర్నాటకకు తరలిస్తున్న ముఠా అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌‌లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్నాటకకు తరలిస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు, సివిల్ సప్లైస్ విజిలెన్స్ అధికారులు కలిసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 22 టన్నుల రేషన్ బియ్యం, 2 టన్నుల గోధుమలు, ఒక లారీ, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు. 

రాజేంద్రనగర్​ డెయిరీ ఫామ్​రోడ్డుకు చెందిన మహ్మద్​ సామి, బీదర్​ జిల్లా మార్కుంద ప్రాంతానికి చెందిన నగేశ్, కర్నాటకలోని బిత్యాల్​ జిల్లాకు చెందిన బీరు కుమార్, చార్మినార్​మీర్​ఆలం ప్రాంతానికి చెందిన ఎండీ.ముబీన్​అహ్మద్​ ఖురేస్గీ, బంజారాహిల్స్​ఖాజానగర్​కు చెందిన అబ్దుల్ నీఫ్​ ముఠాగా ఏర్పడి, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకు ఆటోల్లో వెళ్లి, ప్రజల నుంచి కిలో రేషన్ బియ్యాన్ని రూ.12కు, గోధుమలను రూ.20కు కొనుగోలు చేస్తున్నారు. 

వాటిని కర్నాటకలో ఎక్కువ ధరకు ప్రజలకు, కోళ్ల ఫారాలకు అమ్ముతున్నారు. గురువారం గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల వెనక ఉన్న షెడ్డు వద్ద ఆటోల నుంచి లారీలోకి బియ్యం, గోధుమలను లోడ్ చేస్తుండగా అధికారులు దాడి చేశారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు.