కోనరావుపేట, వెలుగు: బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ లోని మార్కెట్ యార్డులో రూ.51 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు రూ.15.46 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరమ్మ ఇంటి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తోందన్నారు. బ్రిడ్జిలకు నిధులు లేవంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.
కోనరావుపేట మండలంలోని రెండు బ్రిడ్జిలకు సంబంధించిన అంచనాలు సిద్ధమయ్యాయని మరో బ్రిడ్జికి డ్రాయింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కె.ఎల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ముకుంద రెడ్డి, వైస్ చైర్మన్ టి.ప్రభాకర్, నిజామాబాద్ సర్పంచ్ శ్రీహరి, ఉప సర్పంచ్ రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యం, పాక్స్ చైర్మెన్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
తీజ్ వేడుకల్లో విప్
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట, కలికోట తండాల్లో జరిగిన తీజ్ వేడుకలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు, యువతులతో కలిసి సంప్రదాయ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
