‘ఓ.! సుకుమారి’ చిత్రంలో తాను చేసిన దామిని పాత్ర చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందని, ఇదొక క్యూట్ విలేజ్ స్టోరీ అని ఐశ్వర్య రాజేష్ చెప్పింది. తిరువీర్‌కు జంటగా ఆమె నటించిన ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహించగా, మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. జులై 17న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ ఇలా ముచ్చటించింది.
‘‘ఈ కాన్సెప్ట్ విన్నప్పుడే చాలా కొత్తగా అనిపించింది. నేను చేసిన దామిని పాత్రకు ఒక ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ముట్టుకుంటే షాక్ కొడతాను. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పాత్ర ప్రయాణాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. ఇందులో తిరువీర్ కార్పొరేటర్ కావాలని కలలు కనే యువకుడిగా కనిపిస్తారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఎవరికి ముందు కొడుకు పుడితే అతనికే ఆస్తి రాస్తానని తండ్రి నిర్ణయిస్తాడు. అదే సమయంలో నేను తనకి పరిచయం అవుతాను.
మా మధ్య జరిగే ప్రేమకథ, పెళ్లి ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తాయి. నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లు చేస్తున్నా. ఇప్పటివరకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలేదు. నీలాంబరి తరహా పాత్రలు చేయాలని ఉంది. అలాగే 'అబ్సెషన్' లాంటి పాత్రల్లో కూడా నటించాలని ఉంది’’.
