భూమి కోసం అత్తను చంపిన కోడలు..మంచంపై నుంచి పడిపోయిందని డ్రామా, కోడలు అరెస్ట్

భూమి కోసం అత్తను చంపిన కోడలు..మంచంపై నుంచి పడిపోయిందని డ్రామా, కోడలు అరెస్ట్

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో ఏప్రిల్ లో జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. భూమి కోసం కోడలే హత్య చేసి, మంచం పైనుంచి పడి చనిపోయిందని డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ గురువారం వెల్లడించారు. 

గ్రామానికి చెందిన కొణతం భాగ్యమ్మకు ఆరెకరాల భూమి ఉంది. కొడుకు చనిపోవడంతో కోడలు మధురతో కలిసి ఉంటోంది. భూమిలో తనకు కూడా వాటా ఇవ్వాలని భాగ్యమ్మ కుమార్తె శోభారాణి తుంగతుర్తి కోర్టులో కేసు వేసింది. ఈ క్రమంలో శోభారాణికి రెండు ఎకరాలైనా ఇవ్వాలని ఏప్రిల్ 27న భాగ్యమ్మ సూచించింది.  దీంతో భూమి చేజారిపోతుందన్న కోపంతో అత్తను చంపేందుకు నిర్ణయించుకుంది. 

ఇందులో భాగంగా గట్టిగా తోసేయడంతో కిందపడిన భాగ్యమ్మ అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత మంచం పైనుంచి పడి చనిపోయిందంటూ నమ్మించింది. ఏప్రిల్ 28న అంత్యక్రియలు చేస్తుండగా.. శరీరంపై గాయాలు కనిపించడంతో కూతురు శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా... కోడలు మధురే హత్య చేసినట్లు తేలింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.