- కార్డుపై క్యూఆర్ తో పాటు ఎఫ్ ఎస్ సీ నంబర్, లబ్ధిదారుడి పేరు
- జిల్లా కేంద్రాలకు చేరుకున్న కార్డులు
- త్వరలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
యాదాద్రి/జనగామ, వెలుగు : ప్రజలకు త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందబోతున్నాయి. ఈ మేరకు కార్డులు ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు చేరాయి. త్వరలోనే రేషన్ షాపులకు పంపించి, అక్కడి నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు దశాబ్దాల తర్వాత కార్డు మార్పు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రికిగా వైఎస్రాజశేఖర రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయానికి రాష్ట్రంలో రేషన్ బుక్స్ చలామణిలో ఉండేవి. అధికారంలోకి వచ్చిన రెండేండ్లకు 2006లో ఫ్యామిలీ ఫొటోలతో కూడిన కొత్త రేషన్‌కార్డులను అప్పటి ప్రభుత్వం జారీ చేసింది.
ఆ తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్రేషన్ కార్డులను పట్టించుకోలేదు. 2023 నాటికి రాష్ట్రంలో 90,36,856 రేషన్‌కార్డులు ఉండగా 1.59 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులపై దృష్టి సారించింది. 2025 ఫిబ్రవరి నుంచి అర్హులైన వారికి కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు, మార్పులు చేర్పులకు అప్లికేషన్లను తీసుకుంది. దీంతో ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో కార్డుల సంఖ్య 1,06,28,08 చేరగా, మెంబర్ల సంఖ్య 3,42,50,110కు పెరిగింది.
కార్డుపై సీఎం, సివిల్ సప్లై మంత్రి ఫొటోలు, క్యూఆర్
ఇరవై ఏండ్ల కింద ప్రజలకు ఫొటో కూడిన రేషన్ కార్డులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్లీ ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులను అందించనుంది. ఏటీఎం కార్డు సైజులో తయారు చేసిన ఈ స్మార్ట్‌రేషన్ కార్డులపై ఎడమ వైపు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో, కుడి వైపు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు ఫొటోల మధ్యలో తెలంగాణ ప్రభుత్వం లోగో, లబ్దిదారుని పేరుతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్, క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించారు. ఒక్కో రేషన్‌షాపులో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారో ఆ సంఖ్యకు అనుగుణంగా ప్యాక్ చేసి, మండలాల వారీగా
పంపించారు.
