ఫారెస్ట్ ఆఫీసర్పై దాడి కేసులో కోనేరు కృష్ణకు జైలు

ఫారెస్ట్ ఆఫీసర్పై దాడి కేసులో కోనేరు కృష్ణకు జైలు
  • మరో ఏడుగురికీ ఆరు నెలల చొప్పున శిక్ష 
  • ఏడేండ్ల తర్వాత తీర్పు వెల్లడించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు 
  • రుజువులు లేకపోవడంతో 29 మంది నిర్దోషులుగా విడుదల

ఆదిలాబాద్, వెలుగు: 2019లో సంచలనం సృష్టించిన సార్సాల ఘటనలో అటవీ అధికారులపై దాడి చేసిన 8 మందికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.3,500 జరిమానా ఖరారు చేస్తూ ఆదిలాబాద్​లోని ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి దానియరుత్ తీర్పు వెల్లడించారు. ఈ 8 మందిలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, ఆసిఫాబాద్​ జడ్పీ మాజీ వైస్​చైర్మన్​ కోనేరు కృష్ణ, భూరం పోచం, పుల్ల శ్రీకాంత్, కొట్ట మల్లేశ్, బబ్బెర శంకర్, బబ్బెర రాజశేఖర్, భూరం మల్లేశ్, బబ్బెర శ్యామల ఉన్నారు.


మొత్తం 39 మంది మీద పోలీసులు చార్జ్​షీట్​ దాఖలు చేయగా  కేసు నడుస్తుండగానే ఇద్దరు నిందితులు మృతి చెందారు. గురువారం కాగజ్ నగర్ డీఎస్పీ, నోడల్ అధికారి  ఎండీ వహీదొద్దీన్, కాగజ్ నగర్ రూరల్ సీఐ కుమార స్వామి పర్యవేక్షణలో పీపీ రమణారెడ్డి, లైజన్ అధికారి ఈశ్వర్ సింగ్ 37 మంది సాక్షులను ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టగా 29 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు.

ఆ రోజు ఏం జరిగిందంటే.. 

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముస్కు రమణా రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019 జూన్ 30న ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాల  అటవీ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ 133, 136లో మొక్కలు నాటేందుకు ఎఫ్ఆర్వో చోలే అనిత ఆధ్వర్యంలో 30 మంది ఫారెస్టు సిబ్బంది పోలీసు బందోబస్తుతో వెళ్లారు. ఫారెస్టు సిబ్బంది ఉదయం 20 హెక్టార్ల భూమిని ట్రాక్టర్లతో చదును చేస్తుండగా సార్సాల గ్రామస్తులు అడ్డుకున్నారు. కొంత మందిని పోలీసు స్టేషన్ తరలించేందుకు జీపులో ఎక్కించి తరలిస్తుండగా అప్పటి జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ అడ్డుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన కృష్ణ, ఆయన 

అనుచరులు జీపులో ఎక్కించిన వారిని దింపేసి, సిబ్బందిపై దాడికి దిగారు. వీరిని ఎఫ్ఆర్వో అనిత అడ్డుకునే ప్రయ త్నం చేస్తుండగా కోనేరు కృష్ణ  ఆమెపై వెదురు కట్టెతో దాడి చేశాడు. తలపై కొడ్తున్న క్రమంలో ఆమె చేతిని అడ్డుపెట్టగా తీవ్రగాయలై కిందపడిపోయారు. ఇతర సిబ్బందిని సైతం విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించినట్లు పీపీ వెల్లడించారు. దీంతో పోలీసులు గాయపడ్డ సిబ్బందిని హాస్పిటల్​కు తరలించారు. ఈఘటనపై ఎఫ్డీవో రాజారమణా రెడ్డి ఈజ్ గాం పోలీస్​స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఆర్వో అనితపై హత్యాయత్నం, విధుల్లో ఉన్న అధికారులపై మూకుమ్మడి దాడి, కులం పేరుతో దూషించడం వంటి అంశాలపై పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అప్పటి ఎస్సై రాజేశ్వర్ కేసులు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించారు.