హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని డాక్టర్ల రీడిప్లాయ్‌మెంట్ ప్రక్రియకు షెడ్యూల్ విడుదలైంది. మెడికల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లకు తిరిగి టీవీవీపీ ఆస్పత్రుల్లో పోస్టింగ్ పొందే అవకాశం కల్పించారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ కేడర్లలోని అన్ని విభాగాల డాక్టర్లు ఈ ప్రక్రియలో పాల్గొనవచ్చు. అర్హులైన డాక్టర్లు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని టీవీవీపీ కమిషనర్ కార్యాలయం సూచించింది.
శుక్రవారం వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. శనివారం ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. డాక్టర్ల సీనియారిటీ, ఖాళీల ఆధారంగా పోస్టింగ్‌లు కేటాయించి ఈనెల 20న తుది ఉత్తర్వులు జారీ చేయనున్నారు. డాక్టర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో అధికారిక వెబ్ పోర్టల్‌లో లాగిన్ అయి తమకు కావాల్సిన ఆస్పత్రులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. గడువులోపు వెబ్ ఆప్షన్లు ఇవ్వని డాక్టర్లు తమ ప్రాధాన్యత హక్కును కోల్పోతారని అధికారులు తెలిపారు.
