మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి : డీజీపీ సీవీ ఆనంద్

మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి :   డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్, వెలుగు :   రాష్ట్రంలో మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై  ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజలందరికీ సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా సేఫ్ సిటీ ప్రాజెక్టును మరింత పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం డీజీపీ ఆఫీసులో పోలీసు, మున్సిపల్, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, హాక్‌‌‌‌‌‌‌‌ఐ యాప్, సేఫ్ ట్రావెల్ కార్యక్రమాలు సమర్థంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తొలి దశలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి కమిషనరేట్ల పరిధిలో 2,306 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో మరో 862 కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందన్నారు.