హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్రీడా రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్పోర్ట్స్ పై ప్రభుత్వానికి ఒక క్లియర్ విజన్ ఉందని, గతంలో హైదరాబాద్ జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో సరికొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చామని, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి క్యాష్ రివార్డ్స్ పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ అండగా నిలుస్తున్నామని చెప్పారు.
క్రీడలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో పాటు, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దబోతున్నామని సీఎం వెల్లడించారు. టీజీ20 టోర్నమెంట్‌లో విజయం సాధించిన క్రీడాకారులను గురువారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రత్యేకంగా అభినందించిన సీఎం, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు టీజీ20 ఒక అద్భుతమైన అవకాశమని కొనియాడారు.
ఏ రంగంలోనైనా రాణించాలంటే నిరంతర దృష్టి , ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి అత్యంత కీలకమని క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. క్రీడల్లో మరింతగా రాణించి భవిష్యత్తులో దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో పెంచే క్రీడాకారులుగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
