ఆసియా ఆఫ్రికన్‌ పసిఫిక్‌ క్లాసిక్‌ చాంపియన్‌షిప్‌‎లో శ్రేణిక్‌కు సిల్వర్‌ మెడల్‌

ఆసియా ఆఫ్రికన్‌ పసిఫిక్‌ క్లాసిక్‌ చాంపియన్‌షిప్‌‎లో శ్రేణిక్‌కు సిల్వర్‌ మెడల్‌

హైదరాబాద్‌, వెలుగు: డాక్టర్​బి. ఆర్‌. అంబేద్కర్ విద్యాసంస్థల లెక్చరర్,​ పవర్ లిఫ్టర్ మారుపాక శ్రేణిక్.. ‘ఆసియా ఆఫ్రికన్‌ పసిఫిక్‌ క్లాసిక్‌, ఎక్విప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ అండ్‌ బెంచ్‌ ప్రెస్‌ చాంపియన్‌షిప్‌’ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన 74 కేజీల ఓపెన్‌ సీనియర్‌ విభాగంలో శ్రేణిక్‌ మొత్తం 565 కేజీల బరువు ఎత్తి రెండో ప్లేస్‌లో నిలిచాడు. ఏళ్ల తరబడి కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు ఈ విజయం నిదర్శనమని డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ ఇనిస్టిట్యూషన్స్‌ పేర్కొంది.
 
‘అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని, క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని విద్యా సంస్థల కరస్పాండెంట్‌ సరోజ వివేక్‌ అన్నారు. ఈ మెడల్‌ శ్రేణిక్ క్రీడా జీవితంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న యువ పవర్ లిఫ్టర్లకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి అంతర్జాతీయ పోటీలలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి, దేశంలో పవర్ లిఫ్టింగ్ అభివృద్ధికి తోడ్పడాలని శ్రేణిక్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.

 ఇండియాకు ప్రాతినిధ్యం వహించి మెడల్‌ గెలవడం చాలా గర్వంగా ఉందని శ్రేణిక్‌ అన్నారు. భవిష్యత్తులో గోల్డ్ మెడల్ కోసం మరింత కష్టపడేలా నన్ను ప్రేరేపిస్తుందన్నారు. ఈ విజయాని తోడ్పాటు అందించిన అంబేద్కర్ కళాశాల  కరస్పాండెంట్ సరోజా వివేక్, సీఈవో  ప్రొఫెసర్ లింబాద్రి, డైరెక్టర్ ప్రొఫెసర్ జి. యాదగిరి, ప్రిన్సిపల్ మట్టా శేఖర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్. కిరణ్ కుమార్, కోచ్ తిరువీధుల కౌశిక్, కుటుంబ సభ్యులందరికి తన కృతజ్ఞతలు తెలిపారు.