హైదరాబాద్, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 237 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. ఈ గంజాయి విలువ రూ.1.18 కోట్లు ఉంటుందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. విజయవాడ- ముంబై హైవేపై ఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో లారీ కంటైనర్‌ను అడ్డగించి తనిఖీ చేయగా ఈ నెట్‌వర్క్ బయటపడింది. మొదట డ్రైవర్, కూలీ అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా.. వారి కాల్ డేటా ఆధారంగా ఒడిశా వెళ్లినట్లు గుర్తించారు. లారీ క్యాబిన్‌లో దాచిన 10 గోనె సంచుల గంజాయిని సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ముంబై నుంచి లారీలో వచ్చిన నిందితులు లారీ ఓనర్ రాజేశ్‌కుమార్, కూలీ అనిల్ విజయవాడలో పీవీసీ పైపులు అన్‌లోడ్ చేశారు. అక్కడి నుంచి ఒడిశాలోని గుణ్‌పూర్ వెళ్లి, విశాఖపట్నంలో పబిత్ర కుమార్ సబర్ అనే సప్లయర్ దగ్గర గంజాయి లోడ్ చేసుకుని పుణెకు బయలుదేరారు. హైదరాబాద్ క్రాస్ అవుతుండగా పోలీసులకు చిక్కారు. లారీ డ్రైవర్, కూలీ అరెస్ట్ కాగా, ప్రధాన సప్లయర్ పబిత్ర కుమార్, పుణెకు చెందిన పెడ్లర్లు సురేశ్ కేదారి, ధరం షిండే పరారీలో ఉన్నారు.
