కులవృత్తులను ప్రోత్సహిస్తం..బీసీ చేతివృత్తుల మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కులవృత్తులను ప్రోత్సహిస్తం..బీసీ చేతివృత్తుల మేళాను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • ఐమాక్స్ పక్కన హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్‌‌లో 60 స్టాళ్ల ఏర్పాటు
  • కళాకారులను ఆదుకోవాలని మంత్రి పిలుపు

హైదరాబాద్, వెలుగు: బీసీల కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్‌‌లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, ఈర్లపల్లి శంకర్​, కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ ఇన్​చార్జి ప్రిన్సిపాల్ సెక్రటరీ బాల మాయదేవితో కలిసి “బోనాలు - చేతివృత్తుల మేళా-2026”ను మంత్రి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో కులవృత్తులకు ప్రత్యేక స్థానం ఉందని, ఇవి కనుమరుగుకాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ఇక్కడ 60 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేళాలో బోనం కుండలు, నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి, గద్వాల్ చేనేత వస్త్రాలు, పెంబర్తి ఇత్తడి కళాఖండాలు, వరంగల్ దుర్రీలు అందుబాటులో ఉన్నాయన్నారు.

వినాయక చవితి కోసం మట్టి విగ్రహాలను కూడా ఇక్కడ ఉంచినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ మేళాను సందర్శించి, వస్తువులను కొనుగోలు చేసి బీసీ కళాకారులను ఆదుకోవాలని మంత్రి కోరారు. బీసీ వర్గాలకు చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువులను ప్రజలకు చేరువ చేయడమే ఈ మేళా ఉద్దేశమన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేతివృత్తుల కళాకారులకు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు 60 స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా మట్టి కుండ తయారు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సీఈవో అలోక్ కుమార్,  బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు