- బీజేపీ, హిందూ సంఘాల నిరసనతో టీచర్ తొలగింపు
- సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో ఘటన
మలక్ పేట, వెలుగు: హైదరాబాద్ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో విద్యార్థికి 'కల్మా' నేర్చుకోవాలని హోంవర్క్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా చదవాలని టీచర్ చెప్పినట్లు అతని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. తమ మత విశ్వాసాలకు భిన్నంగా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గురువారం తమకు తెలిసిన బీజేపీ, హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. మతపరమైన పాఠాలు బలవంతంగా చెప్పించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంఘాల ఎంట్రీతో ఉద్రిక్తత నెలకొనడంతో పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్కూల్ యాజమాన్యం స్పందించింది. 'కల్మా' నేర్చుకోవాలని చిన్నారికి హోంవర్క్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ షేక్ ఆయేషా పర్వీన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు సహకరిస్తామని తెలిపింది. చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయురాలు డైరీలో రాసిన అంశం స్కూల్ విధానాలకు విరుద్ధమని పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌ను తొలగించిందని, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం సక్సెస్ స్కూల్ వద్ద పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు.
