బోనమెత్తిన గోల్కొండ..అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆషాఢ మాస బోనాలు 

బోనమెత్తిన గోల్కొండ..అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆషాఢ మాస బోనాలు 
  • అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆషాఢ మాస బోనాలు 
  • గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించిన కుమ్మరులు 
  • రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం 
  • లంగర్​హౌస్ నుంచి గోల్కొండకు ఘటాలు, బోనాలు, తొట్టెల ఊరేగింపు
  • పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో కోలాహలం


మెహదీపట్నం, హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఆషాఢమాస బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ చౌరస్తాలో జగదాంబిక మహంకాళి (ఎల్లమ్మ తల్లి) రథంలో ఉన్న అమ్మవారి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని లంగర్ హౌస్‌‌ లోని  చోటా బజార్ లో గల ఆలయ పూజారి అనంత చారి ఇంట్లో ఉన్న ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించి అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా పల్లకిలో అమ్మవారిని కోట పైన ఉన్న ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో గోల్కొండ కోట వరకు ఘటాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు వైభవంగా జరిగింది. రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో భారీగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల ఆటలతో లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు పండగ వాతావరణం సంతరించుకుంది. మహిళలు, శివసత్తుల పూనకాలతో పాటు పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. 

అంబారీపై అమ్మవారి ఊరేగింపు.. 

గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారి దేవాలయంతో పాటు మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఈ మహంకాళి అమ్మవారి పూజారి సాయిబాబా చారి ఇంట్లో నుంచి అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారిని అంబారీ (ఏనుగు) పై గోల్కొండ కోట వైపు భారీ ఊరేగింపుగా తీసుకొచ్చారు.  కోటపై ఉన్న మహంకాళి అమ్మవారికి పూజారి సాయిబాబా చారి, ఆయన కొడుకులు శ్రీకాంత్ చారి, శివ చారి, సురేష్ చారి సుమారు పది తులాల బంగారంతో వస్త్రం, తాళిబొట్టు, నల్లపూసల తాడును  చేయించినట్టు పేర్కొన్నారు.  గత సంవత్సరం బంగారు బోనం కూడా వీరే ఏర్పాటు చేశారు. 

స్టెప్పులేసిన మంత్రి పొన్నం

గోల్కొండ బోనాల సమర్పణ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పోతరాజులతో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. మంత్రి కొండా సురేఖ కూడా చప్పట్లు కొడుతూ మంత్రిని ఉత్సాహపరిచారు. గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత, చరిత్ర ఉందని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ బోనాలు సంస్కృతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. జంట నగరాల్లో దారులన్నీ గోల్కొండ వైపే ఉన్నాయన్నారు. బోనాలకు వచ్చే భక్తులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి బోనాల పండుగ చూసేందుకు హైదరాబాద్ కు ప్రజలు, భక్తులు తరలివస్తున్నారన్నారు. బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్ల నిధులను కేటాయించారని అందులో భాగంగా గోల్కొండ కోట జగదాంబ మహంకాళి అమ్మవారి దేవాలయానికి రూ.11 లక్షల చెక్కును అందజేశారు. ఈ ఉత్సవాలలో ప్రభుత్వ సలహాదారులు వి.  హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, హైదరాబాద్​జిల్లా కలెక్టర్  ప్రియాంక ఆలా, అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఆలయ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ ఉత్సవ కమిటీ సభ్యులు సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, ఆర్డీఓ రామకృష్ణ, ఆలయ ఈవో వసంత, తహసీల్దార్ ప్రవీణ్, నయీముద్దీన్ తో పాటు వివిధ విభాగాల ఆఫీసర్లు పాల్గొన్నారు. 

అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలి

బంగారు బోనం సమర్పించిన అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తొలి బోనంతో ఆషాఢబోనాలు ప్రారంభించుకున్నట్టు తెలిపారు. గోల్కొండ జగదాంబ అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నారు. వందల సంవత్సరాల నుంచి జంట నగరాల్లో వైభవోపేతంగా బోనాల సంప్రదాయం కొనసాగుతుందన్నారు. గోల్కొండ జగదాంబ అమ్మవారు మహిమగల తల్లి అని ఆమె ఆశీస్సులు ప్రభుత్వంపై కూడా ఉండాలని కోరుకున్నారు. 1813లో హైదరాబాద్‌‌లో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో మహంకాళి అమ్మవారిని ప్రార్థించిన భక్తులు.. వ్యాధి తగ్గితే ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారని..  వ్యాధి తగ్గిన తర్వాత ఆ మొక్కును నిలబెట్టుకుంటూ  ఏటా బోనాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోందని మంత్రి వివరించారు.