డంపింగ్ యార్డు జీవోను రద్దు చేయాలి...సిద్ధాపూర్‌‌లో అఖిలపక్ష జేఏసీ సమావేశం

డంపింగ్ యార్డు జీవోను రద్దు చేయాలి...సిద్ధాపూర్‌‌లో అఖిలపక్ష జేఏసీ  సమావేశం

షాద్​నగర్, వెలుగు: కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్‌‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అఖిలపక్ష జేఏసీ గురువారం సమావేశం నిర్వహించింది. ముఖ్య అతిథిగా మహబూబ్‌‌నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్​641ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఆమె నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 

హైదరాబాద్ చెత్తను తెచ్చి షాద్‌‌నగర్ ప్రాంతంలో పడేయాలనుకోవడం సరికాదన్నారు. పచ్చని వ్యవసాయ భూముల్లో డంపింగ్ యార్డు పెడితే 10 కిలోమీటర్ల పరిధిలోని 50 గ్రామాల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమస్యపై త్వరలోనే సీఎంకు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాస్తానని.. అవసరమైతే హైదరాబాద్‌‌కు పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు.