వెలుగు ఓపెన్ పేజీ :జీతాలు పెరుగుతున్నా సామాన్యుడి జేబు ఖాళీ.. వేతనాలు వర్సెస్‌‌ ద్రవ్యోల్బణం

వెలుగు ఓపెన్ పేజీ :జీతాలు పెరుగుతున్నా సామాన్యుడి జేబు ఖాళీ.. వేతనాలు వర్సెస్‌‌ ద్రవ్యోల్బణం

భారతదేశం ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మ్యాప్‌‌లో ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతోంది.  స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ,  క్షేత్రస్థాయిలో సామాన్యుడి ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక వైపు సగటు వేతనాల పెంపు కనిపిస్తున్నా,  మరోవైపు  ద్రవ్యోల్బణం ఆ వృద్ధిని  గణనీయంగా కబళిస్తోంది.  ‘వాస్తవ వేతన వృద్ధి’ అంటే  కేవలం జీతం పెరగడం కాదు,  ప్రతి పౌరుడి నిజమైన కొనుగోలు శక్తి పెరగడం. ముఖ్యంగా  ఆహార ద్రవ్యోల్బణం,  ఇంధన ధరల పెరుగుదల  సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌‌పై  తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవలి గణాంకాల ప్రకారం సగటు జీతాల పెరుగుదల,  పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య ఉన్న వైరుధ్యాన్ని మనం లోతుగా విశ్లేషించాల్సిన సమయం ఆసన్నమైంది.   2026 జులై నాటికి  భారత ఆర్థిక వ్యవస్థ సగటున 9% వేతన పెంపును చూస్తోంది.  ఇది వినడానికి ఆశాజనకంగా ఉన్నప్పటికీ,  ద్రవ్యోల్బణం అనే  'అదృశ్య పన్ను' ఈ వృద్ధిని ఎలా కబళిస్తోందో  మనం చూడాలి. 

రిటైల్ ద్రవ్యోల్బణం 3.9% నుంచి 5%లోపు 

హెచ్చుతగ్గులకు లోనవుతోంది.  ఇక్కడ కీలకమైన సూత్రం ఏమిటంటే,  వాస్తవ వేతన వృద్ధి = నామినల్ వేతన వృద్ధి మైనస్ ద్రవ్యోల్బణం. అంటే,  ఒక ఉద్యోగికి 9% జీతం పెరిగినా  ద్రవ్యోల్బణం 
5% ఉంటే, అతని కొనుగోలు శక్తి కేవలం 4% మాత్రమే పెరిగినట్లు.   ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఈ ప్రభావం మధ్యతరగతి, పేద వర్గాలపై తీవ్రంగా పడుతుంది.‘కె’ ఆకృతి పోలిన రికవరీ, అసమానతలుప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో 'కె- షేప్డ్'  రికవరీ  స్పష్టంగా కనిపిస్తోంది.  ఆర్థిక సేవలు, సాఫ్ట్‌‌వేర్,  ఏఐ వంటి నైపుణ్యం కలిగిన రంగాల్లో పనిచేసేవారికి వేతనాలు  ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరుగుతున్నాయి.  కానీ, తయారీ రంగం, చిన్న తరహా పరిశ్రమలు,   అసంఘటిత రంగాల్లోని కార్మికుల పరిస్థితి భిన్నంగా ఉంది.  వీరి వేతనాల పెంపు ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేకపోతోంది.  దీనివల్ల దేశంలో సంపద సృష్టి జరుగుతున్నప్పటికీ, ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే,  వినియోగదారుల ఖర్చు మందగించడం,  తయారీ రంగ  కంపెనీల  లాభాలపై  నేరుగా ప్రభావం చూపుతుంది.  అంటే,  క్షేత్రస్థాయిలో ఆదాయం పెరగకపోతే, కార్పొరేట్ వృద్ధి కూడా దీర్ఘకాలంలో నిలకడగా ఉండదు. 

యువత  నైపుణ్యం సాధించాలి

మే 2026 నాటికి  నిరుద్యోగిత  రేటు 5.5% వద్ద ఉండటం అనేది మన ఆర్థిక వ్యవస్థకు  ఒక హెచ్చరిక లాంటిది.   నిరుద్యోగిత పెరిగినప్పుడు,  పని చేసేవారిపై  ఆధారపడే వారి సంఖ్య  పెరుగుతుంది, ఇది 'పర్ క్యాపిటల్' (తలసరి) ఆదాయంపై  భారాన్ని పెంచుతుంది.  కొత్తగా  ఉద్యోగాల్లోకి  వచ్చే యువతకు తగిన నైపుణ్యాలు లేకపోవడం,  పరిశ్రమల అవసరాలకు,  విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య ఉన్న గ్యాప్ వల్ల ఉపాధి అవకాశాలు పరిమితమవుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు,  సామాజిక స్థిరత్వానికి సంబంధించిన సవాలుగా పరిగణించవచ్చు.  కేవలం వృద్ధి రేటును పెంచడంపైనే కాకుండా, ఆ వృద్ధి 'నాణ్యత'పై దృష్టి పెట్టాల్సిన  సమయం ఆసన్నమైంది. యువత  కేవలం  డిగ్రీలకే పరిమితం కాకుండా,  ఎమర్జింగ్  టెక్నాలజీస్,  ఏఐ వంటి రంగాల్లో  నైపుణ్యం సాధించాలి.  ఇది వారి వేతన సామర్థ్యాన్ని పెంచుతుంది.  ఆహార  ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అగ్రికల్చరల్ సప్లై చైన్‌‌ను  ఆధునికీకరించాలి.  నిత్యావసరాల ధరలు అదుపులో ఉన్నప్పుడే సామాన్యుడి 'డిస్పోజబుల్ ఆదాయం' పెరుగుతుంది.  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలు ఉపాధి కల్పనతో ముడిపడి ఉండేలా చూడాలి.

రాష్ట్రాలవారీగా నెలకొన్న పరిస్థితి 

భారత దేశాన్ని ఒకే ఆర్థిక యూనిట్‌‌గా చూడటం సరైనది కాదు.  భారతదేశం భౌగోళికంగా,  ఆర్థికంగా విభిన్నమైన రాష్ట్రాల సమ్మేళనం.  రాష్ట్రాల వారీగా వేతనాలు,  ద్రవ్యోల్బణం మధ్య ఉన్న అంతరాన్ని విశ్లేషిస్తే  అక్కడ ఉన్న 'వాస్తవ కొనుగోలు శక్తి' ఎలా ఉందో  మనకు స్పష్టంగా అర్థమవుతుంది.  పారిశ్రామిక,  సేవా రంగ హబ్‌‌లు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు  రాష్ట్రాల్లో సగటు వేతనాలు దేశంలోనే అత్యధికం.  సాఫ్ట్‌‌వేర్,  ఫైనాన్స్,  తయారీ రంగాలు  ఇక్కడ బలంగా ఉన్నాయి.  ఈ రాష్ట్రాల్లో వేతనాలు అధిక మోతాదులో ఉన్నప్పటికీ జీవన ప్రమాణ వ్యయం కూడా ఆ స్థాయిలో ఉండటం వల్ల హౌసింగ్ ఇన్‌‌ఫ్లేషన్  పెరిగి  పొదుపు  సామర్థ్యం తగ్గుతుంది.  ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో గృహ అద్దెలు, రవాణా, సేవా రంగాల ధరల పెరుగుదల వేతన వృద్ధిని మింగేస్తోందనే చెప్పాలి.  మౌలిక సదుపాయాల అభివృద్ధి రాష్ట్రాలు తెలంగాణ, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక మండలాలు.  తెలంగాణ వంటి రాష్ట్రాలు ఐటీ,  ఫార్మా రంగాలతోపాటు,  వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా సమతుల్యతను కలిగి ఉన్నాయి.  ఈ  రాష్ట్రాల్లో మెరుగైన సరఫరా గొలుసు,  ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన వల్ల వేతన వృద్ధి స్థిరంగా ఉండటం వల్ల జీవన వ్యయం,  ఆదాయం మధ్య అంతరం ఇక్కడ తక్కువగా ఉంటుంది.

ఆహార ద్రవ్యోల్బణం

వ్యవసాయ ఆధారిత,  అత్యధిక జనాభా గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు ఆహార ద్రవ్యోల్బణంకు ఎక్కువగా గురవుతారు.  కూరగాయలు,  తృణధాన్యాలు,  ఇంధన ధరలు స్వల్పంగా  పెరిగినా,  వీరి కొనుగోలు శక్తిపై  తీవ్ర ప్రభావం పడుతుంది.  ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ సగటు వేతనంలో  పెరుగుదల  లేకపోవడం,  ద్రవ్యోల్బణం అదుపు కాకపోవడంతో  వాస్తవ ఆదాయం స్తంభించి వలసలకు దారి తీస్తుందని చెప్పవచ్చు.  ఈ విధంగా  ఒక రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 3% ఉంటే,  మరొక రాష్ట్రంలో అది 6% ఉండవచ్చు.  ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాంటి  పాలసీల  వైఫల్యానికి సంకేతం.  కావున ఆర్బీఐ  తీసుకునే నిర్ణయాలు అన్ని రాష్ట్రాలపై  సమాన ప్రభావం చూపకపోవచ్చు.  వేతనాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి కార్మికులు  మెట్రో నగరాలకు వలసవెళ్లడం వల్ల,  ఆ నగరాల్లో 'లేబర్ సప్లై' పెరిగి వేతనాల పెరుగుదల మందగిస్తుంది. ఇది ఒక రకమైన 'వేజ్ బ్యాలెన్సింగ్' ప్రక్రియ.   కంపెనీలు తమ ఉత్పాదక కేంద్రాలను ఎంచుకునేటప్పుడు,  కేవలం  తక్కువ  వేతనాలు మాత్రమే చూడకుండా,  ఆ ప్రాంతంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని కూడా  పరిగణనలోకి తీసుకోవాలి. దీంతో తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో కార్మికుల జీవన ప్రమాణాలు స్థిరంగా ఉంటాయి. 

అంతరాన్ని తగ్గించాలి

భారతదేశం ఆర్థికంగా ఎదగాలంటే  వేతనాలు,   ద్రవ్యోల్బణం  మధ్య ఉన్న ఈ ప్రాంతీయ అంతరాన్ని తగ్గించాలి.  రాష్ట్రాలు తమ సొంత ‘ప్రైస్ ఇండెక్స్’ రూపొందించుకుని,  స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆర్థిక విధానాలను అమలు చేయాలి.   జీడీపీ  పెరుగుదల కేవలం  అంకెల్లో కాకుండా,  ప్రతి రాష్ట్రంలోని ప్రజల కొనుగోలు శక్తిలో కనిపించినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది.  భారతదేశం 'వికసిత్ భారత్' వైపు  సాగుతున్న ప్రయాణంలో,  ఆ వృద్ధి ఫలాలు సమాజంలోని  చివరి వ్యక్తికి కూడా అందాలి.  ద్రవ్యోల్బణాన్ని  నియంత్రిస్తూనే,  వాస్తవ వేతన వృద్ధిని  పెంపొందించడం ద్వారా మాత్రమే మనం సుస్థిరమైన ఆర్థిక పురోగతిని సాధించగలం.  ఆర్థిక గణాంకాలు కేవలం కాగితాల  మీద బొమ్మలు కాకూడదు,  అవి ప్రతి భారతీయ  పౌరుడి  జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించాలి.  అది జరిగినప్పుడే  మనం నిజమైన ఆర్థిక శక్తిగా అవతరించగలం.

-  డా. ఎండి ఖ్వాజా మొయినుద్దీన్
ఎకానమీ, సోషల్ ఎనలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.