వెలుగు ఓపెన్ పేజీ : లైబ్రరీలే దేశ సంపద

వెలుగు ఓపెన్ పేజీ : లైబ్రరీలే దేశ సంపద

ఒక దేశం ఏ దారిలో ప్రయాణిస్తోందో, దాని భవిష్యత్తు ఎంతటి ఉజ్వలమైనదో తెలుసుకోవడానికి కర్మాగారాల పొగగొట్టాల ఎత్తునో, అంతర్జాతీయ మార్కెట్లలో దాని వాటానో, లేదా సరిహద్దుల్లో పేరుకుపోయిన యుద్ధ సామగ్రి కుప్పలనో చూసి లెక్కగట్టలేం. అవి కేవలం భౌతికమైన కొలమానాలు మాత్రమే. ఒక దేశానికి ఉన్న అసలైన, శాశ్వతమైన మహాధనం... అక్కడి యువత మనస్సులలో నిరంతరం ప్రజ్వరిల్లే ‘జ్ఞాన దీపం’!  ఆ పవిత్ర దీపాన్ని వెలిగించే జగజ్జ్యోతే గ్రంథాలయం. ప్రపంచ పటంలో భారతదేశాన్ని మహోన్నతంగా నిలబెట్టేది కేవలం ఐటీ సంస్థల సంఖ్యో, సూపర్ కంప్యూటర్ల  వేగమో కాదు,  మన యువతరం సాధించే అఖండ జ్ఞానార్జన. ఆర్థిక వ్యవస్థల హెచ్చుతగ్గులకు లొంగని అసలైన దేశ పురోగతికి కొలమానం.. గ్రంథాలయాల్లో జ్ఞానార్జన చేస్తున్న యువ చైతన్య కెరటాలే! 


అమూల్యమైన జ్ఞానాన్ని పేద, ధనిక అనే బేధం లేకుండా అందరికీ ఉచితంగా  పంచే అక్షర దేవాలయాలు మన గ్రంథాలయాలు. ఇక్కడే, పైసా ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోలేని ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థి, దేశాన్ని శాసించే పోటీ పరీక్షల ఉన్నత కలలు కంటాడు.  ఒక మధ్యతరగతి యువకుడు  విశ్వవ్యాప్త పరిజ్ఞానాన్ని ఉచితంగా ఒడిసిపట్టుకోగలడు. దేశాభివృద్ధి అంటే ఫ్యాక్టరీలు, నోట్ల కట్టలు కాదని, అది పౌరుల ఆత్మగౌరవం, తెలివితేటలతో ముడిపడి ఉందని ఈ గ్రంథాలయాలు మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. ఒక దేశం ఎంత పురోగమించిందో చెప్పడానికి ఆ దేశంలోని  మార్కెట్లు, పరిశ్రమలు ఎంత రద్దీగా  ఉన్నాయో చూడకండి. ఆ దేశంలోని గ్రంథాలయాలు ఎంతమంది యువతీ యువకులతో కళకళలాడుతున్నాయో చూడండి. అందుకే గ్రంథాలయాలను ప్రతి పాఠశాల విద్యా వ్యవస్థతో ముడిపెట్టడం ఆవశ్యకం. 

జేపీ ప్రజా గ్రంథాలయం

ఒక సజీవ సాక్ష్యం ఢిల్లీ మందిర్ మార్గ్‌‌లో ఎన్‌‌డీఎంసీ నిర్మించిన ఆధునిక ‘జయప్రకాశ్ నారాయణ్ ప్రజా గ్రంథాలయం’. ఇది కేవలం ఒక భవనం కాదు, జ్ఞాన దాహాన్ని తీర్చే ఒక ఆధునిక తపోవనం. ఒకేసారి 200 మంది కూర్చుని ప్రశాంతంగా చదువుకునేలా, 32 వేలకు పైగా అద్భుతమైన ముద్రిత పుస్తకాలతో పాటు, డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఏకంగా ఒక కోటి ‘ఈ- పుస్తకాల’ను సమకూర్చడం విశేషం. నిశ్శబ్ద పఠన మందిరాలు, పిల్లల కోసం ప్రత్యేక బాలల విభాగం, ఉచిత వై-ఫై, ఈ-–లైబ్రరీ లిఫ్ట్ వంటి సౌకర్యాలతో ఇదొక ఆదర్శవంతమైన విద్యాక్షేత్రంగా వెలుగుతోంది. ఇది నగరంలోని అన్ని ప్రజా గ్రంథాలయాలను సాంకేతికంగా అనుసంధానం చేసి, స్థానిక పాఠశాలలతో కలపడం ద్వారా ఒక బలమైన 'జ్ఞాన సమాజం' నిర్మించడమే దీని అంతిమ లక్ష్యం. అప్పుడే జ్ఞానం అనేది కొందరి ఆస్తి కాకుండా,  ప్రతి పౌరుని హక్కుగా మారుతుంది.

కఠినమైన పరీక్షలకు కల్పవృక్షం

జయప్రకాష్ నారాయణ భారత స్వాతంత్ర్య సమరంలో, ఆపై  నాడు ఆయన ఇచ్చిన ‘సంపూర్ణ క్రాంతి’  పిలుపు యువతలో ఎలాంటి ఉద్వేగాన్ని రగిలించిందో, నేడు ఈ గ్రంథాలయం కూడా యువతలో అక్షర విప్లవాన్ని రగల్చాలి.  యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వేస్ వంటి కఠినమైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ, నగరాల్లో ఖరీదైన కోచింగ్ ఫీజులు భరించలేని పేద, మధ్యతరగతి అభ్యర్థులకు ఈ గ్రంథాలయం ఒక కల్పవృక్షం. ఇక్కడి నిశ్శబ్దం, సమాచార సంపద వారి రెక్కలకు బలాన్నిస్తాయి. యువత ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకుని, తమ 
స్వయంకృషితో, జ్ఞానంతో కెరీర్లను నిర్మించుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి. యువత చదివే ప్రతి అక్షరం ఒక కొత్త ఆలోచనను,  ఒక కొత్త విప్లవాన్ని సృష్టిస్తుంది. ఇలాంటి 
దివ్యాలయాలు దేశవ్యాప్తంగా ప్రతి మూలలోనూ ఏర్పాటు చేయాలి. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి పౌరుడు తమ పిల్లలను గ్రంథాలయాల వైపు నడిపించాలి. రండి, అందరం కలిసి అలాంటి ఒక వెలుగు ప్రపంచాన్ని సృష్టించుకుందాం!

- డా. రవి కుమార్ చేగోని 
ప్రధాన కార్యదర్శి, 
తెలంగాణ గ్రంథాలయ సంఘం

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.