- ముస్లిం అని తెలుసుకుని 15 సార్లు కత్తితో పొడిచిన దుండగుడు
- ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌లో చేరిన సయ్యద్ సోహైలుద్దీన్
- ఆదుకునేందుకు ముందుకొచ్చిన దాతలు.. గో ఫండ్ మీ ద్వారా భారీగా నిధులు
వాషింగ్టన్/హైదరాబాద్: అమెరికా ఉటాలోని వ్యాలీ ఫెయిర్ మాల్‌లో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సోహైలుద్దీన్‌పై దారుణమైన కత్తి దాడి జరిగింది. ‘‘నువ్వు ఎక్కడివాడివి? ముస్లింవేనా?" అని అడిగి తెలుసుకున్న పీటర్ మైఖేల్ లార్సెన్ (48) అనే వ్యక్తి సోహైల్‌ను 15 సార్లు కత్తితో పొడిచాడు. ‘‘నేను ముస్లింలను చంపాలనుకున్నా” అని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ విద్వేష దాడి సమయంలో అక్కడే ఉన్న లూనా నునెజ్ అనే మహిళ కుర్చీలు, బూట్లు విసిరి నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది.
మాల్ కస్టమర్లు, సిబ్బంది కలిసి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో సోహైల్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోహైల్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం, ఆయనే కుటుంబానికి ఏకైక ఆధారం కావడంతో ‘గోఫండ్‌మీ’ ద్వారా నిధులు సేకరించారు. దాతల నుంచి కేవలం కొద్దిరోజుల్లోనే $2,35,000 (రూ. 2 కోట్లకు పైగా) సాయం అందింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్, బాధితుడి కుటుంబానికి పూర్తి కాన్సులర్ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.
