టెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య చెలగిన ఉద్రిక్తతలు బుధవారం రాత్రి నుంచి గురువారం నాటికి తీవ్ర రూపం దాల్చాయి. హార్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు ఇరు దేశాలు భీకర దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలపై అమెరికా రాత్రంతా దాడులు చేయగా.. ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలైన జోర్డాన్, కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఎదురుదాడులకు దిగింది.
ఇరు దేశాల మధ్య ఆరో రోజు కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు నిర్వహించింది. దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ఈ దాడులు సాగాయి. ఇరాన్ ప్రధాన పోర్ట్ సిటీ అయిన బందర్ అబ్బాస్‌లోని రివల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) నౌకాదళ కేంద్రాలు, గ్రేటర్ టుంబ్ ఐలాండ్‌లోని తీరప్రాంత క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్ సెంటర్లను అమెరికా ధ్వంసం చేసింది.
అలాగే, సౌత్ఈస్ట్ఇరాన్లోని ఓ ఆర్మీ బేస్‌పై బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా మరో 13 మంది గాయపడ్డారని ఇరాన్ సైన్యం పేర్కొంది. వెస్ట్ఇరాన్లోని లోరెస్తాన్, నార్త్ ఇరాన్‌లోని సేమ్నాన్ సహా రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల కూడా పేలుళ్లు సంభవించాయి. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ వెంటనే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది.
జోర్డాన్‌లోని అమెరికాకు చెందిన కీలకమైన ‘అల్-అజ్రాక్’ బేస్‌లోని కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇంధన నిల్వ కేంద్రాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. కువైట్ వైపు దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్లను అక్కడి సైన్యం గాల్లోనే అడ్డుకోగా.. బహ్రెయిన్‌లో వైమానిక దాడి సైరన్లు మోగడంతో పౌరులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అమెరికా తమ దేశ పవర్నెట్వర్క్లపై దాడులు చేస్తే, ఎర్ర సముద్రం గుండా వెళ్లే అంతర్జాతీయ చమురు రవాణాను పూర్తిగా నిలిపివేయడానికి సిద్ధంగా ఉండాలని యెమెన్‌లోని హౌతీ రెబెల్స్‌కు ఇరాన్ ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా నిలిచిన చమురు నౌకలు
అమెరికా, ఇరాన్పరస్పర దాడులతో గత నెలలో రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం పూర్తిగా కుప్పకూలింది. అమెరికా మళ్లీ ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు విధించడంతో, ఇరాన్ హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. దీంతో అమెరికా మిత్రదేశాల చమురు నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో అమెరికా దాడి..
బుధవారం రాత్రి అమెరికా జరిపిన దాడులలో షాహిద్ బఘాయీ ఆస్పత్రిలోని పిల్లల క్యాన్సర్ చికిత్స విభాగం ధ్వంసమైంది. దీంతో పిల్లలతో సహా 211 మంది క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ చికిత్స అందించే ఆస్పత్రిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ దాడిని ఇరాన్తీవ్రంగా ఖండించింది. అమెరికా క్రూరమైన దాడికి పాల్పడిందని ఇరాన్ గురువారం ఆరోపించింది. ఈ దాడి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన అకృత్యాలను గుర్తుచేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ అన్నారు.
ఈ దాడి వల్ల ఆస్పత్రిలో చేరిన పిల్లలు తీవ్రమైన బాధకు, ఆందోళనకు గురయ్యారని ఆయన చెప్పారు. కాగా, హార్మూజ్‌పై తమ నియంత్రణను వదులుకునే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రకటించింది. అలాగే, తమ దేశానికి ప్రయోజనం లేని ఏ ఒప్పందాన్నీ తాము అంగీకరించబోమని ఇరాన్ టాప్ నెగోషియేటర్ మహ్మద్ బాకర్ గాలిబాఫ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా తమ పోర్టులపై బ్లాకేడ్‌ను కొనసాగిస్తే, అమెరికా దాని మిత్రదేశాలకు లాభం చేకూర్చే మిగిలిన గ్యాస్, చమురు ఎగుమతి మార్గాలను కూడా మూసివేస్తామని హెచ్చరించారు.
ట్రంప్‌ను చంపేస్తాం.. టెహ్రాన్‌లో భారీ హోర్డింగ్
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరిన తరుణంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వెలిసిన ఒక వివాదాస్పద హోర్డింగ్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. టెహ్రాన్‌లోని అత్యంత కీలకమైన ‘ఇంగ్లాబ్ స్క్వేర్’ వద్ద భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కళ్లు మూసుకుని, శవపేటికలో పడుకుని ఉన్నట్టు ఒక గ్రాఫిక్ చిత్రాన్ని ముద్రించారు. ఆ శవపేటికపై ఇంగ్లిష్, పర్షియన్ భాషల్లో ‘మేము ట్రంప్‌ను చంపేస్తం’ అని రాసి ఉంది. అలాగే, గతంలో అమెరికా చేసిన దాడిలో మరణించిన ఇరాన్ చిన్నారుల జ్ఞాపకార్థం ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
