ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర గురువారం భక్తుల జయజయధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది.‘జై జగన్నాథ్’, ‘హరి బోల్’ నినాదాలతో నగరం మార్మోగింది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన సుమారు 8 నుంచి 9 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆషాఢ శుద్ధ ద్వితీయ రోజున నిర్వహించే ఈ రథయాత్ర దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉత్సవాల్లో ఒకటి. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆలయంలోని రత్న సింహాసనం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. రెండు రోజులుగా పూరీలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అయితే.. రథాలను లాగే సమయంలో చిన్నపాటి అపశృతి చోటుచేసుకుంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.
పూరి: ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్ర గురువారం భక్తుల జయజయధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది. ‘జై జగన్నాథ్’, ‘హరి బోల్’ నినాదాలతో పూరి నగరం మార్మోగింది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన సుమారు 8 నుంచి 9 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆషాఢ శుద్ధ ద్వితీయ రోజున నిర్వహించే ఈ రథయాత్ర దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉత్సవాల్లో ఒకటి. ఏడాదిలో ఒక్కసారే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆలయంలోని రత్న సింహాసనం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తారు.
పహాండీతో ప్రారంభమైన మహోత్సవం
ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సంప్రదాయ ‘పహాండీ’ కార్యక్రమంలో భాగంగా ఆలయం నుంచి దేవతల విగ్రహాలను భక్తి గీతాలు, వేద మంత్రోచ్చారణల మధ్య రథాలపైకి తీసుకువచ్చారు. ముందుగా సుదర్శన చక్రాన్ని, అనంతరం సుభద్రాదేవి, బలభద్రుడు, చివరగా జగన్నాథ స్వామివారిని రథాలపై ప్రతిష్ఠించారు. దేవతల దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు.
ఛేరా పహన్రా
రథయాత్రలో అత్యంత విశిష్టమైన ‘‘ఛేరా పహన్రా’’ కార్యక్రమాన్ని గజపతి మహారాజా దివ్యసింహ దేవ్ నిర్వహించారు. బంగారు చీపురుతో రథాలను ఊడ్చి, పవిత్ర జలాలను చల్లారు. రాజు కూడా జగన్నాథుని సేవకుడే అనే సందేశాన్ని ఈ సంప్రదాయం తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం సంప్రదాయం ప్రకారం ముందుగా భక్తులు బలభద్రుని ‘‘తాళధ్వజ’’ రథాన్ని లాగారు. అనంతరం సుభద్రాదేవి ‘‘దర్పదలన్’’ రథం కదిలింది. చివరగా జగన్నాథుని ‘‘నందిఘోష’’ రథం ప్రయాణం ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు రథాల తాళ్లను లాగుతూ 2.6 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయానికి తీసుకెళ్లారు. కాగా, రెండు రోజులుగా పూరిలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం తగ్గలేదు. రథయాత్ర కోసం ఒడిశా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో సుమారు 13 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా కేంద్ర సాయుధ దళాలకు చెందిన 15 కంపెనీలను కీలక ప్రాంతాల్లో మోహరించారు.
తొక్కిసలాట.. ఒకరు మృతి
జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయం వైపు రథాలను లాగుతున్న సమయంలో ప్రధాన వీధి బడా దండ (గ్రాండ్ రోడ్)లో రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో భక్తులు ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట జరిగింది. దాదాపు 500 మంది ఇబ్బంది పడ్డారు. వారిలో వందమందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్తతకు గురైన వారిని సురక్షితంగా బయటకు తీసి, తాత్కాలిక వైద్య శిబిరాలు, అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఒక భక్తుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా, ఈ తొక్కిసలాటతో సంబంధం లేకుండా మరో భక్తుడు గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
