- ఫెడరల్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్‌ను సమీక్షించనున్న మాజీ ఆర్‌బీఐ గవర్నర్
- రాజ్ చెట్టి, ఆశా శర్మలకు కూడా చోటు
- వీరి రిపోర్ట్‌ల ఆధారంగానే వడ్డీ రేట్ల మార్పుపై నిర్ణయం
న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీని సమీక్షించడానికి భారత సంతతికి చెందిన ఆర్థిక వేత్తలను నియమించింది. మొత్తం ఐదు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయగా, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థికవేత్త రాజ్ చెట్టి, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మలకు అవకాశం ఇచ్చింది. ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ కెవిన్ వార్ష్ ఈ సమీక్షా కమిటీలను ప్రకటించారు. ఈ ప్యానెల్స్‌లో నోబెల్ గ్రహీత థామస్ సార్జెంట్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్, వాల్‌మార్ట్ మాజీ సీఈఓ డగ్ మెక్‌మిలన్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఫెడ్ విధానాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీలు తమ రిపోర్ట్‌లను అందిస్తాయి.
మనవాళ్లకు కేటాయించిన కీలక విభాగాలు:
టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా రాజన్ సేవలు
1. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 'బ్యాలెన్స్ షీట్ పాలసీ' టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా సేవలందించనున్నారు. హార్వర్డ్ ఆర్థికవేత్త కరెన్ దినాన్, మాజీ ఫెడ్ గవర్నర్ జెరెమీ స్టెయిన్‌లతో కలిసి ఆయన ఈ ప్యానెల్‌లో పనిచేస్తారు. ఫెడరల్ రిజర్వ్ అసెట్ హోల్డింగ్స్, మానిటరీ పాలసీ అమలులో వాటి పాత్ర, బ్యాలెన్స్ షీట్ నిర్వహణ వల్ల కలిగే లాభనష్టాలను ఈ కమిటీ పరిశీలించనుంది.
2. డేటా టాస్క్‌ఫోర్స్‌కు రాజ్ చెట్టి నాయకత్వం
యూఎస్‌లో ఆర్థిక అసమానతలు, లేబర్ మార్కెట్‌ను విశ్లేషించడానికి రియల్ టైమ్ డేటాను ఉపయోగించడంలో రాజ్ చెట్టికి అనుభవం ఉంది. 'డేటా' టాస్క్‌ఫోర్స్‌కు కో–లీడర్‌గా, డగ్ మెక్‌మిలన్, కెవిన్ మర్ఫీలతో కలిసి ఆయన పనిచేస్తారు. ఫెడ్ తీసుకునే నిర్ణయాల కోసం రియల్ టైమ్ డేటా క్వాలిటీని చెక్ చేస్తారు.
3. ఉద్యోగాలపై ఆశా శర్మ దృష్టి
మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్‌బాక్స్ సీఈఓ అయిన ఆశా శర్మ.. 'ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయిమెంట్' టాస్క్‌ఫోర్స్‌లో సభ్యురాలిగా నియమితులయ్యారు. మార్క్ ఆండ్రీసెన్, చార్లెస్ ఐ. జోన్స్‌లతో కూడిన ఈ ప్యానెల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్ ఇండస్ట్రీలు ప్రొడక్షన్‌పై , ఉద్యోగాలపై, ఆర్థిక వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అంచనా వేస్తుంది. కాగా, ఈ ఇండిపెండెంట్ టాస్క్‌ఫోర్స్‌లు అందించే రిపోర్ట్‌ల ఆధారంగా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) వడ్డీ రేట్లను మార్చడంపై నిర్ణయం తీసుకుంటుంది.
