రాజ్యాంగ సవరణకు మోదీ సర్కార్ కుట్ర..ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వం

రాజ్యాంగ సవరణకు మోదీ సర్కార్ కుట్ర..ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వం
  • సభలో కేంద్ర వైఫల్యాలను ఎండగడతాం: ఖర్గే, జైరాం రమేశ్​

న్యూఢిల్లీ, వెలుగు:  పార్లమెంటులో అవినీతి పద్ధతుల్లో 2/3వ వంతు మెజారిటీ సాధించేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజ్యాంగాన్ని అవమానించేలా ప్రధాని మోదీ చేస్తోన్న కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వమని స్పష్టం చేసింది. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన వ్యూహాత్మక సమావేశంలో పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ ఎంపీలు పాల్గొన్నారు. వర్షాకాల సమావేశాల్లో కేంద్రం తెచ్చే బిల్లులను ఎదుర్కొనే వ్యూహాలపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు.

డీలిమిటేషన్ బిల్లును పూర్తి శక్తితో వ్యతిరేకిస్తాం!

సమావేశం వివరాలను కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, డాక్టర్ నసీర్ హుస్సేన్‌లు మీడియాకు వెల్లడించారు. కేంద్రం డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ప్రవేశపెడితే పూర్తి శక్తితో వ్యతిరేకిస్తామని, ఇందుకోసం డీఎంకే, ఆప్ సహా విపక్షాలన్నింటినీ ఏకం చేస్తున్నామని తెలిపారు. గత ఏప్రిల్‌లో లోక్‌సభలో ఈ బిల్లు ఓడిపోయినా, హోం మంత్రి మళ్లీ తెచ్చేందుకు చూస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి, ఆ ఎంపీల కోసం కొత్త పార్టీని ఒక 'పార్కింగ్ స్థలం'లా వాడుకుంటూ బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు.

'వన్ నేషన్-వన్ ఎలక్షన్', నీట్ లీకేజీలపై పోరు..

ప్రభుత్వం తలపెట్టిన కీలక ప్రతిపాదనలైన 'ఒకే దేశం-ఒకే ఎన్నిక', ఎఫ్‌సీఆర్‌ఏ (ఎఫ్​సీఆర్​ఏ) సవరణలు, జాతీయ ఆహార భద్రతా చట్టంలో మార్పులను కాంగ్రెస్ తీవ్రంగా అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే, అయోధ్యలో జరిగిన "చందా చోరీ-ఆస్థా సే ధోకా" (విరాళాల చోరీ) అంశాన్ని సభలో లేవనెత్తుతామన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని 
డిమాండ్ చేశారు.