హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రైతు లకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ మేరకు ‘రాష్ట్రస్థాయి ఎల్-నినో కంటింజెన్సీ ప్లాన్–2026’ను గురు వారం సెక్రటేరియెట్లో మంత్రి విడుదల చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఇక్రిశాట్, ఐఐఎంఆర్, కిరడా, ఐఎండీతో పాటు అగ్రికల్చర్, హార్టీకల్చర్ శాఖల నిపుణులు కలిసి ఈ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రాన్ని మూడు వ్యవసాయ ప్రాంతాలుగా విభజించి, 18 ప్రధాన పంటలకు సంబంధించి వర్షాభావ పరిస్థితులకు అనుగుణమైన సాగు సూచనలు, ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాల లభ్యత, భూగర్భ జలాలు, సాగునీటి నిల్వల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. ఈ ప్రణాళికను గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లి ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లు, అగ్రికల్చర్ అధికారులను మంత్రి ఆదేశించారు.
