పేపర్ లీకేజీలకు కేంద్రంగా ఉత్తరాఖండ్: కాంగ్రెస్‌‌ నేత రాహుల్ గాంధీ

పేపర్ లీకేజీలకు కేంద్రంగా ఉత్తరాఖండ్: కాంగ్రెస్‌‌ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: పేపర్ లీకుల కేంద్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం మారిందని లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరాఖండ్ సర్వీస్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించిన నియామక పరీక్షల్లో అక్రమాలను రాహుల్‌‌ గురువారం ఎక్స్‌‌లో ప్రస్తావించారు. పట్వారీ, లేఖ్‌‌పాల్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు నేరగాళ్లు నిర్ణయించిన ధరల ప్రకారం అమ్ముడవుతున్నాయని మండిపడ్డారు. 

పరీక్షల్లో మోసాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ప్రశ్నపత్రాల లీకేజీలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని విమర్శించారు. శుక్రవారం  డెహ్రాడూన్‌‌లో నిర్వహించనున్న ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమానికి విద్యార్థులు, ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రాహుల్ పిలుపునిచ్చారు.