నైన్త్ స్టూడెంట్లకు మూడో భాష వద్దు..కేంద్రం, సీబీఎస్‌‌ఈకి సుప్రీంకోర్టు సూచన

 నైన్త్ స్టూడెంట్లకు మూడో భాష వద్దు..కేంద్రం, సీబీఎస్‌‌ఈకి సుప్రీంకోర్టు సూచన
  •         కావాలంటే 6వ తరగతి నుంచే బోధించడం ఉత్తమం
  •     8వ తరగతి చివరి నుంచే టెన్త్​ పరీక్షల ఒత్తిడి మొదలవుతుంది
  •     రాష్ట్ర భాష, ఇంగ్లిష్‌‌తో పాటు ఏదైనా మూడో భాషను ఎంచుకోవచ్చని కామెంట్​


న్యూఢిల్లీ: 9వ తరగతి నుంచి మూడో భాషను తప్పనిసరి చేయడం విద్యార్థులపై  ఒత్తిడిని పెంచుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 10వ తరగతి బోర్డు పరీక్షల కోసం విద్యార్థులు ఇప్పటికే సిద్ధమవుతున్న సమయంలో కొత్త భాషను ప్రవేశపెట్టడం సరికాదని, దాన్ని 6వ తరగతి నుంచే బోధించడం ఉత్తమమని జస్టిస్ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు. మద్రాస్ హైకోర్టు 2017 తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.  

తమిళనాడు తరఫు న్యాయవాది మూడో భాష 9వ తరగతి నుంచే తప్పనిసరిగా ఉంటుందని చెప్పగా, జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌‌ఈ, ఐసీఎస్‌‌ఈతో పాటు రాష్ట్ర బోర్డులు కూడా 9వ తరగతిలో కొత్త భాషను ప్రవేశపెట్టకూడదని  సూచించారు. 8వ తరగతి చివరి నుంచే 10వ తరగతి పరీక్షల ఒత్తిడి మొదలవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర భాష, ఇంగ్లిష్‌‌తో పాటు ఏదైనా మూడో భాషను ఎంచుకోవచ్చని, తప్పనిసరిగా హిందీయే కావాలని ఎక్కడా లేదన్నారు. ఇదిలా ఉండగా, సీబీఎస్‌‌ఈ మూడో భాష అమలుపై జారీ చేసిన సర్క్యులర్‌‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌‌పై సుప్రీంకోర్టులో వచ్చే వారం విచారణ జరగనుంది.