నాచు మొక్కతో సహజ నీలి రంగు తయారీ..హైదరాబాద్ కేఎన్ బయోసైన్సెస్‌‌కు టీడీబీ ఆర్థిక సాయం

నాచు మొక్కతో సహజ నీలి రంగు తయారీ..హైదరాబాద్ కేఎన్ బయోసైన్సెస్‌‌కు టీడీబీ ఆర్థిక సాయం

న్యూఢిల్లీ, వెలుగు: నాచు మొక్క (స్పిరులినా) నుంచి సహజమైన నీలి రంగు తయారు చేసేందుకు హైదరాబాద్‌‌కు చెందిన కేఎన్ బయోసైన్సెస్ సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ టెక్నాలజీ డెవలప్‌‌మెంట్ బోర్డ్ (టీడీబీ) ఆర్థిక సహాయం అందించనున్నట్లు గురువారం ఢిల్లో ప్రకటించింది. స్పిరులినా నుంచి తయారు చేసే ఈ నీలి రంగును సీ-ఫైకోసయనిన్ అంటారు. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కెమికల్ రంగులకు బదులుగా దేశీయంగా ఈ సహజ రంగును తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీబీ సెక్రటరీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ దేశీయ పరిశోధనలను అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులుగా మార్చేందుకు బయోటెక్నాలజీ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పర్యావరణానికి మేలు చేసే స్వదేశీ టెక్నాలజీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. 

సాధారణంగా రంగుల తయారీలో రసాయనాలు వాడుతారు. కానీ ఈ కొత్త విధానంలో ఎలాంటి కెమికల్స్ లేకుండా పర్యావరణానికి హాని కలగకుండా నాచు నుంచి నీలి రంగును తీస్తారు. ల్యాబ్‌‌లో కాంతి, పోషకాలు అందిస్తూ స్పిరులినాను పెంచి, దాని నుంచి నీటిలో సులువుగా కలిసిపోయే నీలి రంగు పొడిని తయారు చేస్తారు. ఇది అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు సరిపోయేలా ఉంటుందని సంస్థ తెలిపింది. త్వరలో కమర్షియల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ సహజ నీలి రంగును మార్కెట్‌‌లోకి తీసుకురావాలని కేఎన్ బయోసైన్సెస్ యోచిస్తోంది. ఈ టెక్నాలజీని ఐఐటీ గువహటీ పరిశోధకులు స్వదేశీ స్పిరులినా రకం (ఎన్‌‌సీఐఎం 5143)తో అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుతో విదేశీ రంగులపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పాటు అందుతుందని భావిస్తున్నారు.