- భూసేకరణ కేసులో తుది తీర్పు
- పెండింగ్‌లో ఉన్న మరో కేసులోనూ ఇదే రకమైన ఆర్డర్ వచ్చే చాన్స్
- పర్యావరణ అనుమతులకు ముందే 3డీ నోటిఫికేషన్ఇవ్వడంపై ఆబ్జెక్షన్
- త్వరలోనే టెండర్లు.. మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం
మంచిర్యాల, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు నిర్మించనున్న నేషనల్ హైవే 63కి అడ్డంకులు తొలగినట్టే. గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్మెంట్, భూసేకరణను సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల తుది తీర్పు వెలువరించింది. అలైన్మెంట్ మార్పునకు ఆదేశాలు ఇవ్వాలన్న రైతుల అభ్యర్థనను తిరస్కరిస్తూ అందులో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అయితే పర్యావరణ అనుమతులు రావడానికి ఏడాది ముందే భూసేకరణకు సంబంధించిన 3డీ నోటిఫికేషన్ జారీ చేయడంపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ఇండియా(ఎన్ హెచ్ఏఐ) తీరును తప్పుబట్టింది. కోర్టు ఆదేశాల మేరకు గతంలో జారీ చేసిన 3డీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని ఎన్హెచ్ఏఐ అధికారులు వెల్లడించారు. హైకోర్టులో పెండింగ్ ఉన్న మరో కేసులోనూ ఇదే రకమైన ఆర్డర్వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రెండు నుంచి మూడు నెలల్లో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
131.8 కిలోమీటర్లు.. రూ.5,202.08 కోట్లు
ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు 131.8 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్63ని ఫోర్‌లేన్‌గా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అప్పటినుంచి మూడుసార్లు అలైన్మెంట్ మారడంతో పాటు భూసేకరణ సమస్యలు రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకిగా మారాయి. తాజాగా జూన్3న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆన్ఎకనామిక్ అఫైర్స్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ఆమోదం తెలిపింది. ఆర్మూర్ నుంచి జగిత్యాల వరకు 63.600 కిలోమీటర్లకు గాను రూ.2,471.76 కోట్లు, జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు 68.295 కి.మీ. గాను రూ.2,730.72 కోట్లు, మొత్తం రూ.5,202.08 కోట్లతో ఆమోదించింది. హ్యామ్ పద్ధతిలో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినప్పటి నుంచి రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
అలైన్మెంట్లో జోక్యం చేసుకోలేమన్న కోర్టు
ఎన్ హెచ్ 63 అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చడమే కాకుండా గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం తమ వ్యవసాయ భూములను తీసుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ హాజీపూర్ మండలానికి చెందిన పలువురు 2024లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రోడ్డు పనులను టెంపరరీగా నిలిపివేయాలని అప్పట్లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ నెల 6న వెలువరించిన తుది తీర్పులో రోడ్డు అలైన్మెంట్విషయంలో తమ పరిధి పరిమితమని స్పష్టం చేస్తూ అందులో జోక్యానికి నిరాకరించింది. సాంకేతిక అంశాలు, ప్రజావసరాల మేరకు ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ రూపొందిస్తుందని కామెంట్ చేసింది.
అయితే భూసేకరణకు సంబంధించి ఎన్హెచ్ఏఐ జారీ చేసిన 3డీ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. 2025 ఏప్రిల్26న పర్యావరణ అనుమతులు రాగా, దానికి ఏడాది ముందు అంటే 2024 జూలై 18న 3డీ నోటిఫికేషన్ఇవ్వడాన్ని తప్పుబట్టింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు మరోసారి 3డీ నోటిఫికేషన్ జారీ చేసి భూసేకరణ అవార్డు పాస్ చేయనున్నట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు.
ఆర్బిట్రేషన్ ద్వారా పెరగనున్న నష్టపరిహారం
గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో పలువురు రైతులు సాగు భూములను కోల్పోగా, మిగిలిన కాస్త భూములను గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం సేకరిస్తున్నారని, కాబట్టి అలైన్మెంట్ మార్చాలనేది రైతుల ప్రధాన డిమాండ్. కానీ అలైన్మెంట్లో జోక్యం చేసుకోలేమేని హైకోర్టు స్పష్టం చేయడంతో రైతులకు నిరాశమిగిలింది. అయితే రైతుల కోల్పోతున్న భూములకు ప్రస్తుతం నిర్ణయించిన నష్టపరిహారం తీసుకొని ఆర్బిట్రేషన్‌కు అప్లై చేసుకుంటే మరింత ఎక్కువ పరిహారం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
