- పన్ను ఆదాయం ఇక సొంత ఖాతాలోకే
- ఇన్నాళ్లూ ప్రతిపైసా ట్రెజరీకి..ఖర్చుల కోసం ప్రదక్షిణలు
- ఎట్టకేలకు పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 70(3) సవరణకు సర్కార్ రెడీ
- నేటి క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోదించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: పంచాయతీల ఆర్థిక స్వేచ్ఛ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల సొంత నిధుల వాడకంపై విధించిన పరిమితులను ఎత్తివేయబోతోంది. ఇందులో భాగంగా ‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018’ లోని సెక్షన్ 70(3)కి సవరణకు ప్రతిపాదనలు రెడీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేయగా, నేటి క్యాబినెట్‌లో ఆమోదముద్ర పడే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3) ప్రకారం.. గ్రామ పంచాయతీలకు పన్నులు, ఇతర రూపాల్లో వచ్చే సొంత ఆదాయాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ ట్రెజరీలోనే డిపాజిట్ చేయాల్సి వస్తోంది. దీనివల్ల పల్లెల్లో ఏదైనా అత్యవసర పని చేయాల్సి వచ్చినా, మురుగు కాల్వలు సాఫ్ చేయించాలన్నా, తాగునీటి పైపులైన్ రిపేరు చేయాలన్నా ఆ నిధులు డ్రా చేయడానికి ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బిల్లుల ఆమోదంలో తీవ్ర ఆలస్యం జరుగుతుండడంతో స్థానిక సంస్థల ఆర్థిక స్వేచ్ఛ దెబ్బతిన్నదనే విమర్శలు వెల్లువెత్తాయి.
పంచాయతీల అవసరాలకు సొంత పైసలు కూడా వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చట్ట సవరణకు నిర్ణయం తీసుకుంది. కొత్త సవరణ ప్రకారం.. గ్రామ పంచాయతీలకు పన్నులు, ఫీజుల ద్వారా వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో వేయాల్సిన అవసరం లేదు. నేరుగా పంచాయతీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకోవచ్చు. దీనివల్ల స్థానిక అవసరాలకు నిధులను డ్రా చేసుకుని వాడుకునే వీలుంటుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పల్లెల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, మురుగు కాల్వల క్లీనింగ్, మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయొచ్చు.
