- థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవు
- నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నది
- ఇక్కడ క్వాలిటీ లేని బొగ్గు పంపిస్తుండడంతో విద్యుత్ ఉత్పత్తి జరగట్లేదని ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రం అంధకారమయ్యే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు, విద్యార్థులు, వ్యాపారస్థులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ది కోతల సర్కార్.. వాతల సర్కార్ అని విమర్శించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్లే కరెంట్‌కోతలు పెడుతున్నారని మండిపడ్డారు.
సింగరేణి విషయంలో పీపీటీలు పెట్టి థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని ముందే చెప్పామన్నారు. కానీ, 40 లక్షల టన్నుల బొగ్గు ఉందంటూ ప్రభుత్వం బుకాయించిందని విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లలో ఆరేడు రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవన్నారు. యాదాద్రి ప్లాంట్‌లో యూనిట్-1, యూనిట్-4లో బొగ్గు లేక ఉత్పత్తి నిలిచిపోయిందని, భద్రాద్రి ప్లాంట్‌లో నిర్వహణ వైఫల్యంతో ఉత్పత్తి ఆగిపోయిందని చెప్పారు.
విద్యుత్ కోతలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రంలో లోడ్ కేవలం 15 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా ఉత్పత్తి జరగడం లేదు. నిన్న కేవలం 3,190 మెగావాట్ల సామర్థ్యం మేర ఉత్పత్తి జరిగింది. అంటే ఉన్న కెపాసిటీలో కేవలం 44 శాతమే విద్యుదుత్పత్తి చేస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి చేయకుండా.. అడ్డగోలు ధరలకు 80 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను పవర్ఎక్స్చేంజ్లో కొనుగోలు చేస్తున్నారని హరీశ్అన్నారు.
నాణ్యమైన సింగరేణి బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు పంపుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రం లో-క్వాలిటీ బొగ్గు పంపిస్తున్నారన్నారు. 70 రేక్‌లు పంపితే 30 రేక్‌లు రిజెక్ట్ అవుతున్నాయని తెలిపారు. ‘‘రైతులు లోవోల్టేజ్, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నరు. త్రీ ఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రంతా పొలం వద్ద జాగారం చేస్తున్నరు. కరువు వస్తది అని వాతావరణ శాఖ ఎప్పటి నుంచో చెప్తున్నది. వీళ్లకు నీళ్ల మీద.. కరెంట్ మీద ధ్యాస లేదు. ధ్యాసంతా కమీషన్లు, కొట్లాటల మీదనే ఉంది’’ అని విమర్శించారు.
