- డాక్టర్ల రిపోర్టు ఆధారంగా చికిత్స అందిస్తామన్న సొలిసిటర్ జనరల్
- నా ఆరోగ్యం బాగానే ఉంది: వాంగ్‌చుక్
- వాంగ్‌చుక్ లాంటి విద్యావేత్తలనే విద్యాశాఖ మంత్రిగా నియమించాలి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ వైద్యుల బృందంతో ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దేశంలో ప్రతి పౌరుడి ప్రాణం అత్యంత విలువైనదని, వారి ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతని స్పష్టం చేసింది. ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు కీలక హామీ ఇచ్చారు. వాంగ్‌చుక్‌కు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యుల నివేదికల ఆధారంగా ఎలాంటి అత్యవసర వైద్య సహాయం లేదా జోక్యం అవసరమైనా ప్రభుత్వం వెంటనే అందించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ హామీని రికార్డు చేసిన హైకోర్టు ఈ పిటిషన్‌ను పరిష్కరించింది.
9 కిలోల బరువు తగ్గిన వాంగ్‌చుక్
దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి వాంగ్‌చుక్ ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గి, ప్రస్తుతం 56 కిలోలకు చేరుకున్నారని, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అయితే, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై సోనమ్ వాంగ్‌చుక్ ఒక వీడియో సందేశం ద్వారా స్పందించారు. దీక్షను విరమించాలని కోరుతున్న శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. "నా వైద్య పరీక్షల నివేదికలు ప్రస్తుతానికి బాగున్నాయి. మరికొన్ని రోజుల పాటు నేను ఈ దీక్షను కొనసాగించగలను. చనిపోయేంత ఘోరంగా నా పరిస్థితి ఏమీ లేదు, ఎవరూ ఆందోళన చెందవద్దు" అని భరోసా ఇచ్చారు.
వాంగ్‌చుక్‌కు సంఘీభావం తెలిపిన కేజ్రీవాల్
జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ దీక్షా శిబిరానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వచ్చి వాంగ్‌చుక్‌కు సంఘీభావం ప్రకటించారు. నీట్ పరీక్ష అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి, పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి వాంగ్‌చుక్ లాంటి విద్యావేత్తలే సరైన వారని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
