- హోర్డింగ్‌లు, విద్యాసంస్థల ప్రచార బ్యానర్లతో కళ తప్పుతున్న జంక్షన్లు
- జంక్షన్ల సుందరీకరణపై బల్దియా కమిషనర్ ఫోకస్
- జంక్షన్లలో ప్రచార హోర్డింగ్స్, బ్యానర్లు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‍లో జంక్షన్లు, మెయిన్ రోడ్ల వెంట ఇష్టారీతిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులపై జీడబ్ల్యూఎంసీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. జంక్షన్లలో అందమైన కళారూపాలు, కట్టడాలు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే అనాధికార ప్రచారాలపై డీఆర్‍ఎఫ్ బృందాలతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగిస్తున్నారు. సిటీలో రెండు విడతలుగా నెల రోజుల పాటు డ్రైవ్ నిర్వహించి గ్రేటర్‌ను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ జి.వెంకన్న ఆదేశాలు జారీ చేశారు.
ఫ్లెక్సీలు, బ్యానర్లతో జంక్షన్లు కళావిహీనం
గ్రేటర్ వరంగల్ దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హనుమకొండ నుంచి హైదరాబాద్, కరీంనగర్, తొర్రూరు, నర్సంపేట, ములుగు వంటి మార్గాల్లో ప్రధాన రోడ్లు, జంక్షన్లతో 15–20 కిలోమీటర్ల వరకు సిటీ వాతావరణమే కనిపిస్తుంది. వీటి పరిధిలో సుమారు 30 జంక్షన్లు, డివైడర్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడచూసినా భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో అందంగా కనిపించాల్సిన జంక్షన్లు కళావిహీనంగా మారుతున్నాయి. మరోవైపు స్మార్ట్‌సిటీ, కుడా ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వివిధ కళారూపాలతో జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తీరా ఆ పనులు పూర్తికాగానే లీడర్లు, ఎడ్యుకేషన్ఇన్స్టిట్యూట్ల ఫ్లెక్సీలను అడ్డుగా పెట్టి అనుమతి లేకుండా ప్రచారాలు చేపడుతున్నారు.
కమిషనర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍గా ఇటీవల వెంకన్న బాధ్యతలు చేపట్టారు. వచ్చీరాగానే సిటీలో ఫ్లెక్సీలతో అనధికార ప్రచారాలు, జంక్షన్లను ప్రాధాన్యతను తగ్గించడాన్ని గుర్తించారు. అధికారులతో సమావేశమై వీటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. డీఆర్‍ఎఫ్ బృందాలను వెంటబెట్టుకుని గురువారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హనుమకొండలో ప్రధాన జంక్షన్లు అంబేద్కర్ సెంటర్, మిషనరీ హస్పిటల్, సర్క్యూట్ గెస్ట్ హౌజ్ వంటి ప్రాంతాల్లో అనుమతి లేకుండా రోడ్లపై వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, ప్రచార బిల్ బోర్డులను తొలగించారు. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఇతర వ్యాపార సంస్థలు జీడబ్ల్యూఎంసీ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్టింగ్‌లు ఏర్పాటు చేస్తే జరిమానాలతోపాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతోపాటు వీటి స్థానంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు ప్రతిబింబించేలా చిత్రాలు, సమాచారం పొందుపరచనున్నారు.
బ్యూటిఫుల్ నగరానికి సహకరించాలి
చారిత్రక వరంగల్ నగరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వివిధ ప్రాంతాల జనాలు, పర్యాటకులు గ్రేటర్ వరంగల్‌లో పర్యటించే క్రమంలో అందమైన జంక్షన్లు, రోడ్లు, కట్టడాల ప్రాధాన్యత దెబ్బతినేలా అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, వ్యాపార సంస్థలు తమ తీరును మార్చుకుని సుందర నగరానికి సహకరించాలి. లేకపోతే మున్సిపల్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలు, చర్యలు తప్పవు. -టి.వెంకన్న, గ్రేటర్ వరంగల్ కమిషనర్
