కొత్త బీటెక్ సీట్లకు సీఎం గ్రీన్ సిగ్నల్ ..సుమారు 3 వేల సీట్లు పెరిగే అవకాశం

కొత్త బీటెక్ సీట్లకు సీఎం గ్రీన్ సిగ్నల్ ..సుమారు 3 వేల సీట్లు పెరిగే అవకాశం
  • నేటి నుంచే ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
  • ఫస్ట్ ఫేజ్ ముగిశాక ప్రస్తుతం అందుబాటులో 27,487 సీట్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని బీటెక్ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాలేజీల్లోని వసతుల ఆధారంగా అవసరం మేరకు కొత్త సీట్లకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ కొత్త సీట్లపై నెలకొన్న అనిశ్చితిపై సోమవారం 'వెలుగు' దినపత్రికలో ప్రచురితమైన ‘ఇంజినీరింగ్ కొత్త సీట్లపై సస్పెన్స్’ కథనం సర్కారులో కదలిక తెచ్చింది. ఈ స్టోరీపై స్పందించిన ప్రభుత్వం వెంటనే అధికారులతో ఆరా తీసింది. సీఎంఓ సెక్రటరీ శ్రీధర్ విద్యాశాఖ అధికారులతో మీటింగ్ నిర్వహించి, ప్రస్తుత డిమాండ్, అవసరాలపై చర్చించారు. పూర్తి వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కొత్త సీట్లకు పర్మిషన్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో అధికారులు సమావేశమై సీట్ల పెంపుపై చర్చించారు. కొత్తగా సుమారు 3 వేల వరకూ సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం ఏఏ కాలేజీల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయనే వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

నేటి నుంచే సెకండ్ ఫేజ్ ప్రాసెస్..

టీజీ ఎప్ సెట్ రెండో విడత ప్రవేశాల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో ఇప్పటికే మొత్తం 27,487 సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మొదటి విడతలో సీట్లు పొంది రిపోర్ట్ చేయని వారు 19,325 మంది ఉండగా, మిగిలిపోయిన సీట్లు 8,162 ఉన్నాయి. వీటన్నింటినీ రెండో విడతలో భర్తీ చేయనున్నారు. కొత్తగా పెరిగే 3 వేల సీట్లు కూడా ఈ విడతలోనే కలిసే అవకాశం ఉంది. ఈనెల 17న ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ ప్రక్రియ 22తో ముగియనున్నదని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో జాగ్రత్తలు వహించాలని, మెరుగైన కాలేజీ, కోర్సు పొందడానికి వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం https://tgeapcet.nic.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను 
సంప్రదించాలని కోరారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. 

ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: జులై 17 
సర్టిఫికెట్ వెరిఫికేషన్: జులై 18
వెబ్ ఆప్షన్లు : జులై 18 నుంచి 19 వరకు
సీట్ల కేటాయింపు: జులై 22న