న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను వీడుతున్న శాస్త్రవేత్తల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గగన్‌యాన్, జాతీయ ప్రాధాన్యం కలిగిన కీలక స్పేస్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) దరఖాస్తులను వెంటనే ఆమోదించవద్దని ఆదేశించింది. ఇటీవలి కాలంలో 100 మందికి పైగా శాస్త్రవేత్తలు ఇస్రోను వదిలి వెళ్లిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అంతరిక్ష శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్) జులై 14న యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్‌సీ), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) సహా ఇస్రోకు చెందిన ప్రధాన కేంద్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గగన్‌యాన్, వంటి ప్రతిష్ఠాత్మక మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్–‘ఏ’ సైంటిస్టుల రాజీనామాలు, వీఆర్‌ఎస్‌లను రొటీన్‌గా అంగీకరించవద్దని స్పష్టం చేసింది. అలాంటి దరఖాస్తులు వచ్చినప్పుడు ఆయా సెంటర్ల డైరెక్టర్లు తమ సిఫారసులతో వాటిని నేరుగా అంతరిక్ష శాఖకు పంపాలని కేంద్రం ఆదేశించింది.
వారి దరఖాస్తుపై తుది నిర్ణయం శాఖే తీసుకుంటుందని తెలిపింది. కాగా, ఇటీవల రాజీనామా చేసిన 100 మందికి పైగా శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది బెంగళూరులోని యూఆర్‌ఎస్‌సీ, తిరువనంతపురంలోని వీఎస్‌ఎస్‌సీలకు చెందినవారే ఉన్నారు. వీరిలో సీనియర్ శాస్త్రవేత్త విక్టర్ జోసెఫ్.టి కూడా ఉన్నారు. ఆయన ఎల్‌వీఎం–3 (మునుపటి జీఎస్‌ఎల్‌వీ మార్క్–3) ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు
