హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్‌కు చెందిన మీడియా ప్రభుత్వంపై కావాలనే విష ప్రచారం చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. గురువారం గాంధీ భవన్‌లో జరిగిన 'ప్రజలతో ముఖాముఖి' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రజలు నిజాలు గుర్తించి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి అప్పులే మిగిలాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.
కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని చెప్పారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే గాంధీ భవన్‌లో 'ప్రజలతో ముఖాముఖి' కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో 100కు పైగా అర్జీలు వచ్చాయని, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించామని చెప్పారు. మిగిలిన వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. రాబోయే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని మంత్రి శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.
