అడ్డదారిలోకి దొడ్డుబియ్యం ..సన్నబియ్యంగా మార్చి మార్కెట్ లో అమ్మేందుకు ప్లాన్

అడ్డదారిలోకి దొడ్డుబియ్యం ..సన్నబియ్యంగా మార్చి  మార్కెట్ లో అమ్మేందుకు ప్లాన్
  • ఇటీవల టెండర్ లో రూ.122 కోట్ల దొడ్డు బియ్యాన్ని దక్కించుకున్న రైస్ మిల్లర్
  • క్లీనింగ్ పేరుతో పాలిషింగ్ కు యత్నించడంతో బయటకు పొక్కిన వ్యవహారం
  • మొదటి పర్మిషన్ ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేసిన ఆఫీసర్లు 
  • ఇప్పుడు ఆ బియ్యాన్ని ఏం చేస్తారని జోరుగా చర్చ

కరీంనగర్, వెలుగు : సివిల్ సప్లై కార్పొరేషన్ నిర్వహించిన టెండర్ లో దక్కించుకున్న దొడ్డు బియ్యాన్ని  సన్నబియ్యంగా మార్చేందుకు ఓ రైస్ మిల్లర్ చేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ఓ మిల్లర్ క్వింటాల్ కు రూ.2,170 చొప్పున 56,555 టన్నుల దొడ్డు బియ్యాన్ని సుమారు రూ. 122 కోట్లకు కొనుగోలు చేశాడు. వాటిని ఇథనాల్ ఫ్యాక్టరీలు, పశువులు, చేపలు, కోళ్ల  దాణా వంటి అవసరాలకు అమ్మాల్స ఉండగా, పాలీషింగ్ చేసి సన్నబియ్యం పేరుతో డబుల్ రేట్ కు అమ్మేందుకు ప్రయత్నాలు చేశాడు.

 రీకండిషనింగ్ కోసం జిల్లాలోని 11 మిల్లులకు తరలించేందుకు నెల క్రితమే అనుమతులు తీసుకున్నారు. క్లీనింగ్ పేరుతో బియ్యాన్ని పాలీషింగ్ చేసేందుకు మిల్లర్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఆఫీసర్లు వెంటనే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దీంతో ఇప్పుడు ఆ బియ్యాన్ని ఏం చేస్తారన్న చర్చ మిల్లర్లలో జరుగుతోంది. 

టెండర్ నిబంధనలు ఇవే.. 

దొడ్డు బియ్యం టెండర్ నోటిఫికేషన్ లోనే సివిల్ సప్లై కార్పొరేషన్ ఆఫీసర్లు కొన్ని కండిషన్లు పెట్టారు. టెండర్ లో రైస్ ట్రేడర్స్, బల్క్ బయ్యర్స్, కేంద్ర, రాష్ట్ర సహకార సంస్థలు, ప్రైవేట్ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సహకార సంఘాలు, బేవరేజ్, డిస్టిలరీ కంపెనీలు, ఇథనాల్ కంపెనీల యాజమాన్యాలు పాల్గొనవచ్చని ఉంది.

 ఆ బియ్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలకు, సహకార సంఘాలకు, ఇతర రైస్ మిల్లర్లకు అమ్మొద్దన్న నిబంధన విధించారు. దేశీయ అవసరాలకే విక్రయిస్తామని, విదేశాలకు ఎగుమతి చేయమని దొడ్డు బియ్యాన్ని దక్కించుకున్న వ్యాపారుల దగ్గర అండర్ టేకింగ్ సైతం తీసుకున్నారు. అయితే దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా పాలిష్ చేసి అమ్మొద్దన్న నిబంధన టెండర్ లో లేనప్పటికీ.. ఈ తరహా వ్యాపారాన్ని నేరంగానే పరిగణిస్తారని సివిల్ సప్లై శాఖ అధికారులు చెప్తున్నారు. 

పాలిషింగ్ కు అడ్డుకట్ట పడేనా ?

ఇన్నాళ్లు గోదాముల్లో పేరుకుపోయిన ఈ దొడ్డు బియ్యం రెండు, మూడేళ్ల క్రితం నాటివే. ఇప్పటికే ఈ బియ్యంలో చాలా వరకు పురుగు పట్టి ముక్కిపోయాయి. ఇవి ఉన్న స్థితిలో ఇథనాల్ కంపెనీలకు, పశువులు, చేపలు, కోళ్ల దాణాకు మాత్రమే పనికొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ సదరు మిల్లర్ ఈ బియ్యాన్ని 2.5 మిల్లీమీటర్ల పొడవు వచ్చేదాకా నాలుగైదుసార్లు పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి ఏదైనా బ్రాండ్ పేరుతో కలర్ ఫుల్ ప్లాస్టిక్ సంచుల్లో అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. 

రూ.2170కి క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసిన బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి తక్కువలో తక్కువ రూ.3,500 చొప్పున అమ్మినా సుమారు రూ.100 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉంది. ఇలా సన్నబియ్యంగా మార్చి అమ్మడం చట్టరీత్యా నేరం. బియ్యాన్ని ఎక్కువ పాలిష్​చేయడం వల్ల పోషకాలు పూర్తిగా పోయే అవకాశముంది. ఇది కస్టమర్లను మోసం చేయడంతో పాటు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై సివిల్ సప్లై శాఖ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా
 మారింది. 

పాలిష్ చేస్తే చర్యలు తీసుకుంటాం 

టెండర్ లో దొడ్డు బియ్యం దక్కించుకున్న వ్యాపారులు సన్న బియ్యంగా మార్చితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చడం నేరం. గత నెలలో బియ్యం క్లీనింగ్ కోసమని 11 మిల్లులకు బియ్యం తరలించేందుకు పర్మిషన్ అడిగిన మాట వాస్తవమే. మొదట పర్మిషన్ ఇచ్చి.. అది మా పరిధి కాకపోవడంతో క్యాన్సిల్ చేశాం. 

- శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్, కరీంనగర్ 

రైస్ మిల్లులపై నిఘా పెంచాలి

దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేస్తున్న రైస్ మిల్లులపై అధికారులు నిఘా పెట్టాలి. దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి అమ్మడం ప్రజలను మోసం చేయడమే కాదు ఆహార కల్తీకి పాల్పడడమే. రైస్ మిల్లర్ల ప్రలోభాలకు అధికారులు లొంగొద్దు. ఈ తరహా దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవాలి.

-పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి