మీ వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు కోర్టును వాడుకుంటారా?..నిజామాబాద్కు చెందిన రిటైర్డ్ హెచ్ఎంపై హైకోర్టు ఆగ్రహం

మీ వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు కోర్టును వాడుకుంటారా?..నిజామాబాద్కు చెందిన రిటైర్డ్ హెచ్ఎంపై హైకోర్టు ఆగ్రహం
  •     కోర్టు సమయం వృథా చేసినందుకు రూ. లక్ష ఫైన్ 

హైదరాబాద్, వెలుగు: వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తే సహించబోమని హైకోర్టు హెచ్చరించింది. అధికారులపై ఒత్తిడి తెచ్చి మరో ఉపాధ్యాయుడిపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే పిటిషన్ దాఖలైనట్లు పేర్కొంది. వాస్తవాలను దాచిపెట్టి కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసినందుకు రూ. లక్ష ఫైన్ విధిస్తూ పిటిషన్‌‌ను డిస్మిస్ చేసింది. 

నిర్మల్ జిల్లా పంగిరి గ్రామంలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌‌గా పనిచేస్తున్న ప్రభురాజ్ సాగర్‌‌పై 2022లో ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ నిజామాబాద్‌‌కు చెందిన రిటైర్డ్ హెడ్‌‌మాస్టర్ పి. శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌ను జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రభురాజ్ సాగర్ దూరవిద్య అభ్యసిస్తూ తరగతులకు సక్రమంగా హాజరుకావడం లేదన్నారు సమయానికి స్కూల్‌‌కు రావడం లేదని 2022లో ఫిర్యాదు చేశామని, 2023లో డిపార్ట్‌‌మెంటల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. 

ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ 2017లో రిటైర్ కాగా ఐదేళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని, ఇరువురి మధ్య వ్యక్తిగత విభేదాలున్నాయని తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న సమయంలో జరిగిన ఘటనలపై అప్పుడే ఫిర్యాదు చేయకుండా ఐదేళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది. వ్యక్తిగత కక్షతో పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టమవుతోందని తెలిపింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ. లక్ష ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని మలక్‌‌పేట్ అంధ బాలికల పాఠశాలకు చెల్లించి నివేదికను రిజిస్ట్రార్‌‌కు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.