న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక విషయాలను కోర్టు ముందుంచింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావ్‌కర్.. పరీక్షకు ముందే కెమిస్ట్రీ క్వశ్చన్స్లీక్ చేసేందుకు పేపర్ తయారీ కమిటీలో ఉన్న పీవీ కులకర్ణికి రూ.5 లక్షలు ఇచ్చినట్టు వెల్లడించింది. కులకర్ణి నిర్వహించిన కోచింగ్ తరగతులకు మోటేగావ్‌కర్ కుమారుడు హాజరయ్యాడని, అక్కడే ఈ ప్రశ్నలు అందించినట్లు ఆరోపించింది.
మోటేగావ్‌కర్ ఫోన్లో ప్రశ్నలకు సంబంధించి 36 ఫొటోలు ఉన్నట్టు తెలిపింది. ఈ 32 ఫొటోల్లో 132 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించింది. ఈ ప్రశ్నలన్నింటిలో 111 ప్రశ్నలు నీట్ (యూజీ) కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రూపొందించిన మాస్టర్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలినట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది.
